అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి)

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోరాడుతున్నారు. గత రెండు రోజులుగా అధికారులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తుండగా.. గురువారం ఎనిమిదో రోజు రిలే దీక్షల వద్దకు తాసిల్దార్, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ చేరుకున్నారు. శిబిరాన్ని ఎత్తివేయాలని దీక్షలో కూర్చున్నవారిని పదేపదే ఒత్తిడి చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు చేరుకున్నవారు ఇప్పటివరకు దీక్ష శిబిరం వద్దనే ఉండటం గమనార్హం. దీక్షలను విరమించకపోతే తాము మద్దతు తెలుపబోమని గ్రామస్తులతో తాసిల్దార్, సిఐ అంటున్నారని ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున దీక్ష శిబిరం వద్దకు చేరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం ఆపేది లేదని, శాంతియుతంగానే ఉద్యమం కొనసాగిస్తామని వారు పట్టుపడుతున్నారు.