స్కూల్ ఎడ్యుకేష‌న్ ఆఫీసును ముట్ట‌డించిన నిరుద్యోగులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిరుద్యోగుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాత‌ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యాన్ని నిరుద్యోగులు ముట్ట‌డించారు. దీంతో ల‌క్డీకాపూల్‌లోని ఆ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు త‌మ‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డీఎస్సీని మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. ఆందోళ‌న‌కు దిగిన డీఎస్సీ అభ్య‌ర్థుల‌ను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతూ.. డీఎస్సీ, గ్రూప్-2కు సంబంధించి ఏది వాయిదా వేయాలో అధికారులు నిర్ణ‌యిస్తార‌ని పేర్కొన్నారు. అయితే గ్రూప్-2నే వాయిదా ప‌డుతున్న‌ట్లు అధికారులు మీడియాకు లీకులిచ్చారు. డీఎస్సీ రాత ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా విడుద‌లైంది. ఈ ఎగ్జామ్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఆన్‌లైన్ రాత‌ప‌రీక్షల‌కు స్లాట్‌లు కూడా ఖ‌రారు కావ‌డంతో డీఎస్సీని వాయిదా వేయ‌లేమ‌ని విద్యాశాఖ అధికారులు పేర్కొన్న‌ట్లు స‌మాచారం.  ప‌రిణామాల నేప‌థ్యంలో గ్రూప్-2నే వాయిదా ప‌డుతుంద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే డీఎస్సీ అభ్య‌ర్థులు మాత్రం.. డీఎస్సీనే వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రాజ‌ధానితో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా డీఎస్సీ అభ్య‌ర్థులు త‌మ నిర‌స‌న‌ల‌ను కొనసాగిస్తున్నారు.