ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు
రాష్ట్రంలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు వైరల్ ఫీవర్ఎవరి నోట విన్నా, ఎవరి ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వారకూ అంతా జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తల నొప్పితోపాటు జలుబు వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు అన్ని ఆసుపత్రులూ జ్వరాల బారిన పడిన రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా.. ప్రజారోగ్యం విషయంలో అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు.ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్లుగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రవర్తిస్తున్నది. రోగాలు, నొప్పులు, వ్యాధుల బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు… చర్యలూ లేవు. విష జ్వరాలు విజృంభించి ప్రజల ఒళ్ళూ ఇళ్లూ గుళ్లవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. బస్తీలకు సుస్తీ చేసింది.. పల్లెలు మంచం పట్టినయ్.. అయినా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదు. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే.. అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు..!’ అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.