ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
అమానవీయంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతలుపేదల ప్రాణాల మీదకు తెచ్చింది. సమయం, సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురుచేస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలటమట్టం అవుతుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. ఎప్పుడు ఓ బుల్డోజర్ వచ్చి అర్ధరాత్రి తమ ఇంటిపై నిర్ధాక్షిణంగా దాడి చేస్తుందేమోనని కంటి మీద కునుకులేకుండా పేదలు క్షణ క్షణం భయం భయంగా జీవిస్తున్నారు.
ఒక్కరిది ఒక్కో కన్నీటి కథ..
పక్షవాతంతో మంచాన పడిన ఇంటి పెద్ద , రేపోమాపో ప్రసవానికి సిద్దంగా ఉన్న నిండు గర్భిణి కన్నీటి శోకం ఇంకో వైపు, సామాన్లు అయినా తీసుకునే సమయం ఇవ్వండనే అభాగ్యుల ఆర్తనాదాలు సరేసరి.. నాకు పెళ్లి చేయాల్సిన ముగ్గురు ఆడ బిడ్డలు ఉన్నారు.. నా ఇంటి మీదకు రాకండి, అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఓ తల్లి ఆవేదన మరోవైపు ఇలా ఒక్కరిది ఒక్కో కన్నీటి కథ. ఎవరికి పట్టని వ్యథ. ఇది మూసీ పరివాహాక ప్రాంత ప్రజల దీనస్థితి. తాజాగా హైదరాబాద్ చైతన్యపురిలోమూసీ సర్వేలో భాగంగా అధికారులు సర్వే చేసేందుకు వెళ్లగా ఇలాంటి వ్యథభరితమైన దృశ్యాలు కంటపడ్డాయి.
ఆడపిల్లలు ఉన్నారు కనికరించండి..
ఈ క్రమంలో ఓ తల్లి నా ఇల్లును కూల్చకండి. నాకు పెండ్లి కావాల్సిన ఆడపిల్లలు ముగ్గురు ఉన్నారని అధికారులను వేడుకున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. కాగా, రేవంత్ సర్కార్ పాలన పరాకాష్టకు చేరింది. పొట్టకూటి కోసం కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారాలను సైతం వదలడం లేదు. వనస్థలిపురం రైతుబజార్‌లో చిరువ్యాపారుల తోపుడు బండ్లను జేసీబీలతో చెల్లాచెదురుచేసి తొక్కించారు.ఈ ఘటన బుధవారం జరగగా ఆ రోజు రాత్రి నుంచి బాధితులు అక్కడే ధర్నాకు దిగారు. వర్షంలో తడుస్తూ రాత్రంతా అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. గురువారం కూడా వారి ధర్నా కొనసాగింది. మా పొట్ట కొట్టిన సర్కార్ బాగుపడది’ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చిరువ్యాపారులకు తోపుడు బండ్ల గుర్తింపు కార్డులను ఇచ్చింది. ఆ గుర్తింపు కార్డులతో లోన్లు కూడా తెచ్చుకున్నారు.కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ చిరువ్యాపారుల జీవనాధారం తోపుడు బండ్లను తొలిగించారు. సుమారు 150 తోపుడు బండ్లను తొలిగించారు. ఇలా హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లపై దాడులకు పాల్పడటంపై పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి ముందుకెళ్లాలని పులువురు సూచిస్తున్నారు