తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సీపీ వి. సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ సంచాలకుడు ముషారఫ్‌ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌ కేడర్‌ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. గురువారం సాయంత్రం 5గంటల కల్లా ప్యానల్‌ పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు పలువురి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన వారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.