అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి‌

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుఅన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్ ప్రతినిధులు‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో హరీశ్‌ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల ఇండ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందన్నారు.కేసీఆర్‌ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. సీఎం రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలు రోగాలబారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌ ఖ్యాతిని సీఎం రేవంత్‌ దెబ్బ తీస్తున్నారని చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే మూసీపై ముందుకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.కూకటపల్లిలో హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది రేవంత్ రెడ్డి చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెండ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూలకొట్టే సరికి గుండె పోటుతో చనిపోయిందన్నారు. ఇవ్వన్నీ రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్లే జరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్‌ రాజ్ నహి చలేగా అంటూ ప్రచారం చేస్తున్నాడని, మరి తెలంగాణలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. నేడు తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుందన్నారు. ముందు తెలంగాణకు వచ్చి బుల్డోజర్లు ఆపి ఆ తరువాత బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ ఇక్కడ ప్రచారం చేయాలన్నారు.హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీకోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయన్నారు. ఎప్పుడైనా రావచ్చని, తాము మీ వెంటే ఉంటామని భరోసానిచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామని చెప్పారు. లీగల్‌ సెల్‌ బాధితులకు అండగా ఉంటుందని చెప్పారు.