అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రూ. 99.55 కోట్లతో ఆధ్యాత్మిక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
శ్రీ లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో సీఎం, మంత్రుల ప్రత్యేక పూజలు
జడ్చర్ల, మే 23 (జనంసాక్షి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ అనుబంధ వసతుల విస్తరణలో భాగంగా శనివారం ఆయన యాదగిరిగుట్టలో పర్యటించి, మొత్తం రూ. 99.55 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి వేద పాఠశాల భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డి నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద పాఠశాల భూమిపూజ కార్యక్రమంలో కంచికామకోటి పీఠాధిపతితో కలిసి సీఎం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించగా, వేద పండితులు ముఖ్యమంత్రికి, ఇతర ప్రముఖులకు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తుల సౌకర్యార్థం రూ.99.55 కోట్లతో చేపట్టనున్న ఐదు ప్రధాన పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపనలు జరిగాయి. ఇందులో భాగంగా రూ. 43.80 కోట్లతో వేద పాఠశాల నిర్మాణానికి, భక్తుల వసతి కోసం రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీటితో పాటు కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 9.87 కోట్లు, వైకుంఠ ద్వారం నుండి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు (షెడ్) నిర్మాణానికి రూ. 1.41 కోట్లు, రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి రూ. 1.35 కోట్లు కేటాయించి ఆయా పనులను సీఎం ప్రారంభించారు.కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



