ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

share on facebook

– 41వరోజు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కార్మికులు
– బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదట ఆందోళన
– కొనసాగిన మహబూబాబాద్‌ జిల్లా బంద్‌
– సీఎం కేసీఆర్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆర్టీసీ కార్మికులు
– చికిత్స పొందుతూ కండక్టర్‌ నాగేశ్వర్‌ మృతి
– తొర్రూరు డిపోకు చెందిన మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
– హుటాహుటీన ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్‌, నవంబర్‌14 (జనంసాక్షి)  : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం ఉధృతంగా సాగింది. 41వ రోజుకు చేరినా కార్మికులు వెనక్కు తగ్గకుండా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయాన్నే బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేపట్టారు. డ్రైవర్‌ నరేశ్‌ మృతికి నిరసనగా.. మహబూబాబాద్‌ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వటంతో బంద్‌
ప్రశాంతంగా సాగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జామునుంచే కార్మికులు, అఖిలపక్ష కార్యకర్తలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందగా బంద్‌ పాటిస్తున్నాయి. వరంగల్‌ పట్టణ జిల్లా హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్‌ గ్రావిూణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహించవద్దంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట బస్‌డిపో ఆవరణలో డ్రైవర్లు కండక్టర్లు యూనిఫారం వేసుకొని నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెక్రసీ నేతలు మద్దతు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట గంటపాటు బైఠాయించారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు. మహబూబాబాద్‌లో మృతి చెందిన డ్రైవర్‌ నరేశ్‌కు పలువురు భాజపా నాయకులు నివాళులర్పించారు. కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలాఉంటే మహబూబాబాద్‌ జిల్లాలోనే మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఆర్టీసీ శ్రామిక్‌ కార్మికుడు ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ ఆర్టిసీ డిపోకు చెందిన శ్రామిక్‌ కార్మికుడు మేకల అశోక్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో సమ్మె ఉధృతంగా సాగింది. ఉదయాన్నే ఆర్టీసీ కార్మికులు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. బస్సు డిపో వద్దకు తెల్లవారు జామునే చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీరికి మద్దతు అఖిలపక్షం నాయకులు పాల్గొనడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగం ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
చికిత్స పొందుతూ నాగేశ్వర్‌ మృతి..
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ డిపోకి చెందిన కండక్టర్‌ నాగేశ్వర్‌.. ఆందోల్‌ మండలం జోగిపేటలో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొంతకాలంగా నాగేశ్వర్‌ తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడు. భవిష్యత్‌ గురించి తీవ్రంగా కలత చెందిన నాగేశ్వర్‌.. మతిస్థిమితం కోల్పోయాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం తెల్లవారుజామున అతడు కన్నుమూశాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మృతదేహానికి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Other News

Comments are closed.