ఉమ్మడి జిల్లాలో మున్సిపోల్స్‌ సందడి

share on facebook

ఉమ్మడి జిల్లాలో పాగాకు బిజెపి యత్నాలు
నేతలను కోల్పోవడంతో నైరాశ్యంలో కాంగ్రెస్‌
మెదక్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బిజెపి మెల్లగా బలం పుంజుకుంటోంది. నేతలు అటు టిఆర్‌ఎస్‌ లేదా, ఇటు బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపడంతో కాంగ్రెస్‌ దాదాపు ఖాళీ అవుతోంది. గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ లాంటి వారు తప్ప అంతా ఇప్పుడు పార్టీ వీడారు. గతంలో  మంత్రిగా పనిచేసిన సునీత లక్ష్మారెడ్డి గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మెదక్‌ ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి జిల్లాలో కీరోల్‌ నిర్వరించారు. అనంతర పరిణామ క్రమంలో ఆయన బీజేపీలో చేరారు. జిల్లాలో ఉన్న ఇద్దరు సీనియర్‌ నాయకులు ఇతర పార్టీల్లో చేరడంతో కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడింది.
దీంతో కాంగ్రెస్‌ జిల్లాలో ఉనికిని కోల్పోయింది. ఇప్పటికే బడా నేతలు పార్టీ మారగా కొన్నాళ్లుగా స్తబ్దత రాజ్యమేలుతోంది. తాజాగా కాంగ్రెస్‌ ఎన్నికల క్యాంపెయినింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌, మెదక్‌ మాజీ ఎంపీ విజయశాంతి.. బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో మిగిలిన చోటామోటా నాయకులు ఊగిసలాటలో ఉండగా.. ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో మారిన రాజకీయ పరిణామ క్రమంలో ఆ పార్టీ ప్రాబవం పూర్తిగా కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఆర్‌ఎస్‌ హవాలో ఆ పార్టీ పరిస్థితులు తలకిందులయ్యాయి. క్రమక్రమంగా నేతలు జారిపోవడంతో కోలుకోలేని స్థితికి చేరింది. ప్రధానంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలుకాగా.. అప్పటి నుంచి పార్టీలో స్తబ్దత నెలకొంది. కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల్లోనూ పార్టీ కోసం పనిచేయాలనే తపన కొరవడడంతో ఈ దుస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. తాజాగా.. కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం మొదలైంది. మెదక్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ ఎన్నికల క్యాంపెయినింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌, సినీ స్టార్‌  విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులు అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు చురుకుగా వ్యవహరిస్తూ పార్టీకి బలంగా ఉన్నారు. ఆయన అనేక కార్యక్రమాలతో దూసుకుని పోతున్నారు. సెంబ్లీ పోరు తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గాలి అనిల్‌ కుమార్‌ బరిలో దిగారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అతను ఒక్కసారి కూడా మెదక్‌ జిల్లాను తొంగి చూసింది లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పట్లోళ్ల ఉపేందర్‌రెడ్డి కూడా ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇలా పార్టీలో ఉన్న వారు సైతం అందుబాటులో ఉండకపోవడంతో ముఖ్య నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం కొరవడింది.
తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయశాంతి కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు.. త్వరలో ఆమె బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయశాంతి ముఖ్య అనుచరులు, చోటామోటా నాయకులు సైతం ఊగిసలాటలోనే కొట్టుమిట్టాడుతున్నారు.
ఆర్టీసీ సమ్మె సందర్భంగా కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్‌ నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఇద్దరు, ముగ్గురు తప్ప ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనకపోవడం ఇందుకు నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైరాశ్యంతోపాటు ఆందోళన నెలకొంది.

Other News

Comments are closed.