కోరుకున్న తెలంగాణ కోసమే మా పోరాటం
మాకు ఎవరిపైనా వ్యక్తిగత వ్యతిరేకత లేదు
ప్రశ్నించడం, పోరాడడం ఉద్యమంలో భాగం: కోదండరామ్
హైదరాబాద్,ఆగస్ట్6 (జనం సాక్షి) : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించామని, కానీ అవి నెరవేకపోగా మరింత దారణంగా పరిస్థితులు తయారయ్యాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షలునెరవేరడం లేదని,
పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే తమతో కలసివచ్చే అన్నిపార్టీలను కలుపుకుని ముందుకు వెళుతున్నామని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని, అదేవిధంగా వ్యవసాయం, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తారని భావించామని, కానీ పరిస్థితులు యధాతథంగా ఉన్నాయని అన్నారు. జిల్లాల అభివృద్ధి విస్మరించడం మంచిది కాదని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలతో పాటు ఉద్యోగ నియామకాలుచేయాల్సిఉన్నా అలా జరగలేదన్నారు. పార్టీ ఫిరాయింపులు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుమన్నారు. తెలంగాణ రాజకీయ ఐకాస రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తరవాత మరింత బలంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు బాగోలేవని… మెరుగైన రాజకీయాల్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు, విలువల వ్యక్తీకరణ కోసం మేం ప్రయత్నం చేస్తునే ఉంటామని అన్నారు. ఆ విలువలతో కూడిన రాజకీయాలపై మనకు స్పష్టత ఉంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు వస్తాయి. మన ఆలోచనలకు ఒక భూమికను, చట్రాన్ని ఏర్పాటు చేస్తాయి. మెరుగైన రాజకీయాల కోసం మన ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దన్న సంకల్పంతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. అందరితో కలసి… అవసరమైతే జాతీయస్థాయి నేతలతో కూడా కలసి వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతామని కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా… ఇది ప్రజలు కోరుకున్న తెలంగాణలా కన్పించటం లేదని వ్యాఖ్యానించారు. కొత్త రాష్టాల్ర ఏర్పాటులో తెలంగాణ విలక్షణమైంది. ప్రజల కన్నీళ్ళు, రక్తం, స్వేదం, త్యాగాల ఫలితమిది. ఈ తాత్కాలిక వైఫల్యానికి కారణం రాజకీయం. అందుకే తెలంగాణ కోసం అహరహం శ్రమించిన తాము మళ్లీ ప్రజల ఆకాంక్షల కోసం పోరాబాట పట్టామని అన్నారు. పాత పార్టీల మాదిరిగా కాకుండా కొత్త ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని, సమస్యల పరిష్కారాన్ని చూపెడుతూ రావాలని భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లోని అవినీతి, ఫిరాయింపులు, ఆశ్రిత పక్షపాతాల్ని తొలగించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు స్థానిక రిజర్వేషన్లు సమాన అవకాశాలు కల్పిస్తాయని కోదండరాం పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల పోరాటాలతో స్వ రాష్టాన్న్రి సాధించకున్నామని చెప్పారు. ఏ ఆశయాల కోసం ఉద్యమించామో అవి నెరవేర్చుకోవడానికి ప్రస్తుతం ప్రయాణం కొనసాగించాల్సి ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజనులు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకంజలో ఉన్నారన్నారు. ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తానికి ఎంతో ధైర్యం ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అవకాశాలు కోల్పోయామని, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అన్యాయం జరిగితే సహించలేక పోతున్నామని అన్నారు. ప్రభుత్వంపై తాము యుద్ధం ప్రకటించలేదని, విజ్ఞప్తులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు. దానికే ప్రభుత్వం హడలిపోయి, ఉమ్మడి రాష్ట్రంలో లేని అణచివేతను ప్రయోగిస్తోందని కోదండరామ్ చెప్పారు. ఉపాధి కల్పనకు ఉద్యమం సమయంలో ప్రకటించినంత మేర కృషి జరగడం లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.