దేవాదాయ భూములపై స్పష్టత కరువు

share on facebook

రికార్డులు లేకుండానే సర్వేలు
వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుడి భూముల అన్యాక్రాంతంపై ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ కదిలింది. వివరాలు సేకరించి వాటిని స్వాధీనం ఏసుకునే ప్రయత్నాల్లో అధికారులు కావాలనే కొంత వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆలయాల భూములపై సర్వే చేపట్టాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిషనర్‌ ఆదేశించారు. కొందరు ఈవోలు మొక్కుబడిగా సర్వే చేస్తున్నారని తెలిసింది. క్షేత్రస్థాయికి వెళ్లకుండా, కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారని సమాచారం. కొందరు ఈవోలకు నిబంధనలు, దస్తావేజులు లభించక పోవడంతో అయోమయంలో పడ్డారు. జిల్లా దేవాదాయ శాఖాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిసింది. భూమి ఒక దగ్గర ఉంటే, వేరే దగ్గర బోర్డులు పాతించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఇలా కొన్ని గ్రామాలకు  వెళ్లకుండానే వెళ్లినట్లు నమోదు చేస్తున్నారని సమాచారం. గ్రామల్లో సర్పంచులను సంప్రదిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.  వరంగల్‌ జిల్లా దేవాదాయ శాఖాధికారులు, కార్యనిర్వహణాధికారు లతో రాష్ట్ర కమిషనర్‌ అనీల్‌కుమార్‌ ఇటీవల సమావేశమయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు, ధూపదీప నైవేద్యాల పథకం(డీడీఎన్‌) ద్వారా ఎంపికైనా దేవాలయాల వారీగా భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 165 ఆలయాలు, 590 వరకు డీడీఎన్‌ పథకం కింద ఉన్నాయి. దేవుని పేరుతో ఉన్న భూముల వివరాలు, ఇందుకు సంబంధించిన దస్తావేజులు, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమగ్రమైన సర్వేకు నిర్ణయించారు. మండలాల వారీగా ఈవోలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దేవాలయాల భూముల్లో బోర్డులు పాతేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బోర్డులు తయారు చేయించారు. పది రోజుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిషనర్‌ ఆదేశించారు. మండలాల వారీగా జరుగుతున్న సర్వేను దేవాదాయ శాఖ ఉపకమిషనర్‌, జిల్లా సహాయ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు.

Other News

Comments are closed.