నాగార్జునలో నిత్య వివాదాలు

share on facebook

ప్రతిష్ట దిగాజారుతోందంటున్న విద్యార్థులు
నల్లగొండ,నవంబర్‌8 (జనం సాక్షి) : ఆచార్య నాగార్జునుడి పేరుతో ఏర్పాటుచేసిన విద్యాలయం వివాదాలమయంగా మారింది. స్వయం ప్రతిపత్తి గుర్తింపు తెచ్చుకున్న కళాశాల పేరును పలువురు అధ్యాపకులు దిగజారుస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులను తాజాగా వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే ఆ ఇద్దరు అధ్యాపకులను బదిలీ చేయడం వెనుక ప్రిన్సిపాలే సూత్రదారి అని ఆయన కనుసన్నల్లోనే బదిలీ చేశారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేసిన ఎన్జీ కళాశాల నేడు తీవ్ర విమర్శల పాలవుతోంది. కళాశాల ప్రతిష్ఠకు చెడ్డపేరు తెచ్చేలా ప్రస్తుత అధ్యాపకులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక వివాదంతో కళాశాల పేరు మసకబారుతోంది. కళాశాలలోని పరీక్షల విభాగం మొదలుకొని అన్ని విభాగాల్లో సమన్వయ లోపంతో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. అధ్యాపకుల నడుమ సఖ్యత లేకపోవడం, ఇరువురికి పోటీ ఎక్కువ కావడంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగి విద్యార్థులను పట్టించుకోకపోగా పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్జీ కళాశాలలో వివాదాలకు పరీక్షల విభాగం కూడా ఒక కారణంగా విద్యార్థులు
పేర్కొంటున్నారు. పరీక్షల విభాగానికి సంబంధించి పలువురు అధ్యాపకులు ఆధిపత్యం చెలాయించేలా తమ మాటే నెగ్గాలనే మంకుపట్టుతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడు నెలల క్రితం కళాశాల విడుదల చేసిన పరీక్ష ఫలితాలు తీవ్ర దుమారాన్ని లేపాయి. విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందగా విద్యార్థి సంఘాలు సైతం వారికి మద్దతుగా నిలిచి కళాశాలలో ధర్నాలు చేశాయి. పరీక్షల విభాగం నిర్లక్ష్యంతో డిగ్రీలో కొన్ని సెమిస్టర్ల ఫలితాలు మాత్రమే విడుదల చేయడం, మిగతా సెమిస్టర్ల ఫలితాలు విడుదల చేయకపోవడంతో పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయగా ఓ విద్యార్థి చెయ్యి కొసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  డిగ్రీ స్థాయిలో వచ్చే ఎన్‌సీసీ సర్టిఫికెట్లు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉంటే పోలీస్‌ కొలువులతోపాటు ఇతర ఉద్యోగాల్లో ఎన్‌సీసీ కోటా ఉంటుంది. అయితే ఎన్జీ కళాశాలలో ఎన్‌సీసీ విభాగం అధికారి పోస్టుకు తీవ్ర పోటీ
నెలకొంది. ఎన్‌సీసీ అధికారి బాధ్యత కోసం పోటీపడ్డ ఇద్దరు అధ్యాపకులు కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎదుటే తీవ్ర దూషనలకు దిగగా ఇన్‌చార్జిగా ఉన్న ఎన్‌సీసీ అధికారి నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో అధ్యాపకుడి పై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Other News

Comments are closed.