మావోయిస్ట్‌ చర్యలతో ఏజెన్సీలో మళ్లీ అలజడి

share on facebook

వరుసఘటనలతో ప్రజల్లో ఆందోళన
కూంబింగ్‌ తీవ్రం చేసిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం,జులై 19(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్‌ని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌గా హత మార్చిన ఘటనతో పాటు, విశాఖ ఏజెన్సీలో ఇద్దరు గిరిజనులను తాజాగా ఇదే కారణంతో హతమార్చారు. వరుస ఘటనలతో ఏజెన్సీలో మళ్లీ అలజడి చెలరేగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు  సంచలనంగా మారాయి.  చర్ల మండలంలో కూడా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మండల కేంద్రంతో పాటు గిరిజన గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన జరిగి సుమారు వారం  రోజులవుతున్నా ఇంకా ఈ ఘటనపైనే అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పేరిట ఓ లేఖ సోషల్‌విూడియాలో రావడంతో ఆదోళన పెరిగింది. నాయకులను టార్గెట్‌ చేస్తామని హెచ్చరించడంతో టీఆర్‌ఎస్‌ నాయకులకు భయం పట్టుకుంది. దీంతో చర్ల పోలీసులు అడవులు, రహదారులపై తనిఖీలు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనుమానితులను ప్రశ్నించి వదిలేస్తున్నారు. మావోయిస్టుల హిట్‌లిస్టుల్లో ఉన్న వారిని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్‌ హత్యతో చర్ల మండల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎం జరగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయం గుప్పిత్లో బతుకుతున్నారు. అధికారులు, ఇతరులు గిరిజన గ్రామాలకు వెళ్లాలన్నా భయ పడుతున్నారు. ఫారెస్టు అధికారులు కూడా డ్యూటీలకు వెళ్లేందుకు
వణికిపోతున్నారు. అధికార పార్టీ నాయకులు భయంతో పట్టణ ప్రాంతాలకు వెళుతున్నారు.
ఈ నేపధ్యంలో పోలీసులు కూబింగ్‌ ముమ్మం చేశారు. మరోవైపు పాత చర్లలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల పేరిట కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టుల అరాచకాలు, హత్యలు ఇంకెన్నాళ్ళని ఆ కరపత్రంలో ప్రశ్నించారు. ఏడాది కాలంగా ముగ్గురిని చంపి ఇప్పటి వరకు కారణం చెప్పలేదని ఆరోపించారు. పోడు భూములకు విషయంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తుల అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆరోపించారు. నల్లూరి శ్రీనివాస్‌రావుని ఎందుకు చంపారని, ఆయన చర్ల మండలంలో ఎవరికీ అన్యాయం చేయలేదని, ప్రతీ ఒక్కరికీ సాయం చేసేవాడని, నిజంగా అతడు తప్పు చేసి ఉంటే ఇదివరకే అతడిని పార్టీ హెచ్చరించిందా? అని ప్రశ్నించారు. వీటితో పాటు ఆ కరపత్రాల్లో పలు ఆరోపణలు చేశారు. ప్రధాన రహదారిపై ఈ కరపత్రాలు కనిపించడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళన చెందారు. ఇలా పోలీసులు, అటు మావోల హెచ్చరికలతో ఈ ప్రాంతంలో మారోమారు అలజడి చెలరేగింది.

Other News

Comments are closed.