యూపిఎ ఫ్రంట్‌లో సఖ్యత సాధ్యమేనా

share on facebook

ప్రధాని పదవి ఆశల్లో మాయావతి, మమతా బెనర్జీ
ఉమ్మడి నేతను నిర్ణయించడం కష్టమే
చంద్రబాబు కీలకంగా మారడం సాధ్యమా?
కెసిఆర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై స్టాలిన్‌ నీళ్లు
న్యూఢిల్లీ,మే15(జ‌నంసాక్షి): బీజేపీ వ్యతిరేక పార్టీలలో చంద్రబాబుకు ఉన్నంత సహనం, పరిచయాలు మరే పార్టీ నాయకుడికి లేవు. ఈ అనుకూలతల కారణంగానే కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల నాయకులు చంద్రబాబు వైపు చూస్తున్నారు. ఎన్‌డీయే ప్రభుత్వం ఏర్పాటుకు దారులు మూసుకుపోయే పక్షంలోనే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు లభిస్తుందని టిడిపి నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే ఆనాటి నాయకులకు నచ్చజెప్పినంత తేలిగ్గా ఇప్పటి నాయకులకు చంద్రబాబు నచ్చజెప్పగలరా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇప్పటి నేతల ఆశలు వేరు. వారికి అధికారమే పరమావధి. అందరికీ ప్రధానమంత్రి పదవి కావాలన్న ఆశ బాగా పెరిగింది.  ప్రధానమంత్రి పదవికి మాయావతి అభ్యర్థిత్వాన్ని మమతా బెనర్జీ అంగీకరించే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మమత విషయంలో మాయావతి కూడా ఇదే వైఖరితో ఉంటారు. ఫలితాల తర్వాత మాయావతి పరిస్థితిని బట్టి బీజేపీతో జతకట్టినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఒకవేళ మాయావతి బీజేపీ వైపు చూడకుండా నిలువరించడం చంద్రబాబుకు సాధ్యామా అన్నది కూడా అనుమానమే. ఢిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల మధ్య ఎన్నికలకు ముందు పొత్తు విఫలం అయ్యింది. ఎన్నికల తరవాత ఇది మళ్లీ చిగురిస్తుందా అన్నది కూడా అనుమానమే. ఇన్ని ప్రతికూలతల మధ్య అంతా  సహకరిస్తే తప్ప మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అంత సులభం కాకపోవచ్చు.
మోడీ కూడా ఇదే విశ్వాసంతో ఉన్నారు. ప్రధాని పదవి కోం అంతా కొట్టుకు చస్తారని భావిస్తున్నారు. అందుకే ఎన్నికలయ్యాక మాయావతి లాంటి వారిని దగ్గరకు చేర్చుకోవడం సులవున్న భావనలో ఉన్నారు. ఇకపోతే విపక్షాలను కూడగట్టే పనిలో చంద్రబాబుకు పోటీగా కేసీఆర్‌ ఇప్పటికే రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా చంద్రబాబుపైనే ఆశలు పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి విషయంలో ఆ పదవికి పోటీపడుతున్న వారి మధ్య సఖ్యత కుదర్చడంలో చంద్రబాబు ముందుంటారన్న నమ్మకంలో ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు పేరు తెర విూదకు వచ్చే అవకాశం ఉంటే,అలాంటి అవకాశం వస్తే కాదనుకోకూడదని తెలుగుదేశం నాయకులు కోరుకుంటు న్నారు. ఈ కారణంగానే కేంద్రంలో ఎవరు ప్రధాని అయినా ఫర్వాలేదు.. మోదీ మాత్రం మళ్లీ రాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలంటే ఉత్తరాది పార్టీల బలం ఎంత ముఖ్యమో, దక్షిణాది పార్టీల బలం కూడా అంతే ముఖ్యం కానుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్లో డీఎంకే, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు 60 స్థానాలకు పైగా వస్తే ఈ మూడు పార్టీల బలం కీలకం అవుతుంది. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌ సహకరిస్తారా, చంద్రబాబు తో కలుస్తారా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు బాబుకు,కెసిఆర్‌కు మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అందుకే కెసిఆర్‌ తనకుతానుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.  తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి  తన బలం పెంచుకోవడానికి బీజేపీని వాడుకుంది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో పలుచోట్ల బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో ముస్లింలు కాంగ్రెస్‌కు బదులు టీఆర్‌ఎస్‌కు ఓటేశారని సమాచారం. జేపీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగితే తెలంగాణలో 16 శాతం ఉన్న ముస్లింల మద్దతు తనకు గంపగుత్తగా లభిస్తుందన్నది కేసీఆర్‌ అంచనా వేసి ఆమేరకు ప్రచారం చేశారు. ఇలా విధంగా ప్రాంతీయ పార్టీలన్నీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికై తమదైన ఎత్తుగడలను అనుసరించాయి. మొత్తంగా ఫలితాలు వస్తే ఎవరు ఏంటన్నది తేలనుంది.

Other News

Comments are closed.