రైతులకు అందుబాటులో శుద్దిచేసిన విత్తనాలు 

share on facebook

ప్రైవేట్‌ వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టే యోచన
మహబూబ్‌నగర్‌,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో ఎక్కువగా వరి విత్తనాలనే రైతుల నుంచి పండిస్తున్నారు. తరవాత కందులను ఇస్తున్నారు. మిగతావి తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మిగతా వంగడాల విత్తనాలను డిమాండును బట్టి సంస్థ ఇతర యూనిట్ల నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నారు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో  ఖరీఫ్‌ సీజనులో రైతులకు వివిధ రకాల విత్తనాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి మోసపకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వనపర్తిలోని శుద్ధి కర్మాగారంలో ఈ మేరకు విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో వరి విత్తనాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.  ఇక్కడ పనిచేస్తున్న విత్తనశుద్ధి కేంద్రం ద్వారా రైతులకు విత్తనాలు ఇచ్చి తిరిగి వారి నుంచే సేకరించి ఖరీఫ్‌, రబీ సీజనులో వారికే పంపిణీ చేస్తారు. అలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో  రైతుల నుంచి సేకరిస్తున్నారు. రైతులకు విత్తనాలు ఇచ్చి వారి నుంచి కొనుగోలు చేసినప్పుడు కేవలం శుద్ధి చేసిన విత్తనాలనే బయటి మార్కెట్‌ ధరపై 20శాతం అదనంగా చెల్లించి సేకరిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల వ్యవసాయా ధికారులు ఇచ్చిన ఇండెంటు మేరకు ఇక్కడ కర్మాగారం అందుబాటులో ఉంచింది. సంస్థ ఉమ్మడి జిల్లాలో రైతులకు ఫౌండేషన్‌ విత్తనాలు ఇచ్చి వారితో పండించి తిరిగి తీసుకొని వాటిని శుద్ధిచేసి రైతులకే విత్తనాలుగా అందిస్తోంది. ఐదేళ్లకు పైబడిన వరి వంగడాలకు క్వింటాలుకు రూ.500 రాయితీ, పదేళ్లలోపు ఉన్న వాటిపై రూ.వెయ్యి రాయితీ ఇస్తున్నారు. కందులు, పెసర, మినుములు, వేరుసెనగలపై 33 శాతం, జనుము, జీలుగ విత్తనాలపై 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నారు. మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలపై కిలో ఒక్కంటికి రూ.25 రాయితీ ఇస్తున్నారు. మినుము, పెసర పంటల సాగు ఉమ్మడి జిల్లాలో లేనందున వాటిని విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం యూనిట్‌ నుంచి తెప్పించి రైతులకు సరఫరా చేస్తోంది. అలాగే పచ్చిరొట్ట ఎరువులుగా వాడే జనుము, జీలుగ విత్తనాలనూ ఇండెంటు మేరకు సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నారు.  జిల్లా వ్యవసాయాధికారులు ఇచ్చిన ఇండెంటు ప్రకారం విత్తనాలను సిద్ధం చేశారని తెలుస్తోంది.

Other News

Comments are closed.