సీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత

share on facebook

ప్రముఖరచయిత,నటుడు గొల్లపూడి కన్నుమూత

చెన్నైలో చికిత్సపొందుతూ మృతి

రచయిత,ప్రయోక్త,నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి

గొల్లపూడి మృతికి సినీ పరిశ్రమ దిగ్భాంతి

చెన్నై,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ప్రముఖ నటుడు,రచయిత,ప్రయోక్త గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాలలో నటించిన గొల్లపూడి విజయనగరంలో జన్మించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన మృతి టాలీవుడ్‌ పరిశ్రమకి తీరని లోటు. గొల్లపూడి ఆత్మకి శాంతి కలగాలని సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలో గొల్లపూడి జన్మించారు. గొల్లపూడి మారుతీ రావు విజయనగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము లలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్‌ భౌతిక శాస్త్రములో బి.యస్‌సీ (ఆనర్స్‌) చేశాడు. ఈయన అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు. 13 ఏళ్ల వయస్సులోనే ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు. గొల్లపూడి .. డాక్టర్‌ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి నటించిన చివరి చిత్రం జోడీ. 14 ఏళ్ళకే ఆశాజీవీ మొదటి కథ రాసారు. కె విశ్వనాథ్‌ తొలి చిత్రం ఆత్మగౌరవం చిత్రానికి రచయితగా గొల్లపూడి పని చేశారు. గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత గొల్లపూడి శ్రీనివాస్‌ పేరువిూద,. గొల్లపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్‌ కి గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది.గొల్లపూడి మారుతీ రావు కుమారుడు,గొల్లపూడి శ్రీనివాస్‌ ప్రేమ పుస్తకం అనే సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు ప్రమాద వశాత్తు మరణించారు.ఆయన ఙ్ఞాపకార్దం మారుతీరావుగారు దేశంలోని వివిద భాషల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్లకు గొల్లపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్‌ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

 

రచయితగా లబ్ధప్రతిష్టుడు గొల్లపూడి

ఆయన రాసిన కళ్లు నాటకం ఎంఎలో పాఠ్యాంశం

పలు అవార్డులు,రివార్డులు ఆయనకు సొంతం

గొల్లపూడి మారుతీ రావు నటుడిగానే కాదు రచయితగాను మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన రాసిన తొలి కథ ఆశాజీవి. రేనాడు అనే స్థానిక పత్రికలో డిసెంబర్‌ 9,1954న ఇది వెలువడింది. ఇక ఆయన చేసిన కొన్ని రచనలను భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటకరంగం విూద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. గొల్లపూడి రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఎ తెలుగు విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ఉంది. ఈ నాటకం ఆధారంగా కళ్లు సినిమాను ఎంవి రఘు దర్శకత్వంలో తీసారు. ఇది మంచి చిత్రంగా మన్నన పొందింది. ఆయన రచనల విూద పరిశోధన చేసి, ఎం.ఫిల్‌, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించాడు. తెలుగు సాహిత్యం విూద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి. ఒక రంగంలో రాణించడమే కష్టమైన ఈ రోజుల్లో ఎన్నో రంగాల్లో పరిపూర్ణత సాధించిన బహు కళాప్రపూర్ణుడు గొల్లపూడి మారుతీరావు. ఈయన విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు. ఇలా పలు రంగాల్లో రాణించిన గొల్లపూడి మారుతీరావుకు ఐదు సార్లు నంది అవార్డులు వరించాయి. గొల్లపూడి నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 1963లో డాక్టర్‌ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిగా, 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దీనికి ఉత్తమ రచయితగా, 1991లో మాస్టారి కాపురం సినిమాకు గానూ ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు గొల్లపూడి. అప్పాజోశ్యుల విష్ణుభట్ల ఫౌండేషన్‌ జీవన సాఫల్య అవార్డు, గురజాడ అప్పారావు, పురస్కారం, పులికంటి కృష్ణా రెడ్డి పురస్కారం, ఆత్రేయ స్మారక పురస్కారం, రాజ్యలక్ష్మి అవార్డు, సాహిత్య అకాడవిూ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి అవార్డు, కొండముది శ్రీరామ చంద్రమూర్తి అవార్డు, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు పొందారు గొల్లపూడి.

 

Other News

Comments are closed.