అంచనాలకు అందని హుజూరాబాద్‌ అంతరంగం


గుంభనంగా వ్యవహరిస్తున్న ఓటర్లు
పెదవి విప్పి అభిప్రాయం చెప్పకుండా దాటవేత
చివరి నిముషం వరకు ప్రలోభాలతో ప్రజలకు ఎర
హుజూరాబాద్‌,అక్టోబర్‌29 (జనంసాక్షి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మాజీమంత్రి ఈటెల రాజేందర్‌కు, సిఎం కెసిఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠత నెలకొంది. దీనికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా ఇక్కడ ఎన్నిక అత్యంత ఖరీదయినదిగా మారింది. మరోవైపు డబ్బుల కోసం ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేయడం కూడా ఇక్కడే చూస్తున్నాం. పంచే డబ్బులు ప్రభుత్వానివే కనుక మాకు దక్కాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి రావడం వింతలో వింతగా చూడాలి. గెలుపుకోసం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డిన తొలి ఎన్నిక కూడా ఇదే కాబోలు.
ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఊహాగానాలు సాగుతున్నా.. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రం పరిస్థితి అంచనాలకు అందడం లేదని చెప్పవచ్చు. టిఆర్‌ఎస్‌, బిజెపిలో ఎవరిది పైచేయి అని చెప్పలేక పోతున్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు నువ్వా, నేనా అన్నట్టుగా వ్యవహరించాయి. పోలింగ్‌ మొదలైతేగానీ ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అలాగే ప్రజలు ఎవరి పక్షం అన్నది కూడా కొంతయినా తెలుస్తుంది. మరోవైపు ప్రజలు కూడా డబ్బులకు వాచి ఉన్నారు. ఇక ఓటర్లు కూడా గుంభనంగా వ్యవహరిస్తూ తమ మనోగతం వెల్లడిరచడం లేదు. మొత్తంగా
టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి
బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌.. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈటలను ఓడిరచి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించు కోవాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో వ్యవహరిస్తోంది. అందుకే కెసిఆర్‌ ఎప్పుడూ లేనివిధంగా హుజూరాబాద్‌పై స్వయంగా కార్యరంగంలోకి దిగారు. దళితబంధు లాంటి పథకాలనుతెరపైకి తెచ్చి ప్రభుత్వ డబ్బుతో ప్రజలను మచ్చిక చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఎలాగూ గెలవమని కాంగ్రెస్‌ పార్టీకి తెలుసు. అది ఈటెల, కెసిఆర్‌ వర్సెస్‌గా సాగిందని పిసిసి చీఫ్‌ రేవంత్‌ కూడా ఒప్పుకున్నాడు. అయినా కూడా కాంగ్రెస్‌ ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ ప్రచారం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే తమకే లబ్ది అన్న ధోరణిలో అధికార
టిఆర్‌ఎస్‌ ఉంది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా చివిరి నిముషం వరకు శ్రమించాయి. భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరిగింది. గత మూడు నెలలుగా ఇక్కడ రోజూ పండగే అన్న రీతిలో సాగింది. ఆరోపణల నేపథ్యాల నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. గట్టిగా నిఘా పెట్టాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించింది. డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ విూడియా యాప్స్‌లో విపరీతంగా పోస్టులు హల్‌చల్‌ చేసాయి. ఇందుకు అనుగుణంగా తమకు డబ్బులు రావడం లేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళనలు చేయడం మరింత ఆసక్తిగా మారింది. హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాల్లో రెండు, మూడు చోట్ల కొందరు నిరసనలు తెలిపారు. గురువారం కూడా హుజూరాబాద్‌, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాల్లో, రెండు మున్సిపాలిటీల పరిధిలోని పలుప్రాంతాల్లో కొందరు గుమిగూడి తమకు డబ్బులు రాలేదంటూ ధర్నాలు చేశారు. స్థానిక నేతలు తమకు పంచాల్సిన డబ్బును నొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేయడం, తమకు ఇవ్వడం లేదని నిలదీయడం వంటి ఘటనలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ తరఫున అన్నీతానే ప్రచారాన్ని ఉరకలెత్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఏడున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తరహాలోనే హుజూరాబాద్‌లోనూ బీజేపీ ఊపు ఉంటుందని, గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమాగా చెప్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు దిగాయని.. ప్రజలు తమ కోసం పోరాడే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఓటింగ్‌ సరళి ఎలా ఉండబోతోంది? పోలింగ్‌ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతమున్న అంచనాల మేరకు పోటాపోటీ నెలకొనే అవకాశం ఉంది. అందుకే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు తమదంటే తమదని టీఆర్‌ఎస్‌, బీజేపీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్‌ గణనీయంగా ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.