అంతరిక్షంలో.. త్రివర్ణ రెపరెపలు

– మున్నన్నెల జెండాను ప్రదర్శించిన
సునీతా విలియమ్స్‌
– దేశావాసులకు స్వాతంత్య్ర దినోత్సవ
శుభాకాంక్షలు
రోదసిలో మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సంతతికి చెందిన రోదసి యాత్రికురాలు సునీతా విలియమ్స్‌ ప్రస్తుతం అమెరికా నాసా అంతరిక్ష కేంద్రం నుంచి పంపిన అంతరిక్ష నౌకలో కొంతకాలం నుంచి ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె అంతరిక్ష నౌకలోనే 66వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. ఈ రకంగా ఇండియాపై ఆమెకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్‌ అద్భుతమైన దేశం, ఆ దేశంలో భాగమైనందుకు గర్విస్తున్నానని సునీతా తన సందేశంలో పేర్కొన్నారు. తన తండ్రి గుజరాతీ అని, తనకు భారత సంప్రదాయాలు తెలుసునని వివరించారు. 46 ఏళ్ల సునీతా విలియమ్స్‌ రష్యన్‌ వ్యోమగామి యూరి మలెన్షెంకో, జపనీస్‌ వ్యోమగామి అకిహికో హోషిడేలతో కలిసి రష్యన్‌ అంతరిక్ష నౌక సోయజ్‌లో జూలై 15న రోదసీలోకి వెళ్లారు. ఈ నౌకను బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. సునీత ఫ్లైట్‌ ఇంజినీర్‌ కాగా, స్పేస్‌ స్టేషన్‌ చేరుకున్నాక ఎక్స్‌పెడిషన్‌ 33 కమాండర్‌ అయ్యారు.