అకాల వర్షాలకు రైతులు విలవిల.అకాల వర్షాలకు రైతులు విలవిల.


– నష్టపరిహారం కోరుతూ తహసిల్దార్ భగవాన్ రెడ్డికి, ఏవో కి వినతి పత్రం అందజేత.
బూర్గంపహాడ్ మార్చి 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులని ప్రజలని ఆదుకోవాలని స్థానిక తహసిల్దార్ భగవాన్ రెడ్డి కి, ఏవో శంకర్ కి న్యూడెమోక్రసీ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న గులాబ్ తుఫాను వలన రైతులు తీవ్రంగా నష్టపోయి విలవిల్లాడుతున్నారని, నష్టపోయిన వారిని ఆదుకోవాలని మంగళవారం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ- అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దారు భగవాన్ రెడ్డి నీ, అగ్రికల్చర్ ఆఫీసర్ శంకర్ ని కోరారు. అనంతరం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన మండలం లోని మామిడి తోటలు, మిర్చి, వరి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని, పంటలను కాపాడుకుంటూ వస్తుంటే ఈ అకాల వర్షాలతో ఒక్కసారిగా పంటలు నేలమట్టం అయ్యాయన్నారు. కొన్ని గ్రామాలలో రేకులు ఇండ్లు కూలిపోయాయని, అధికారులు ఇప్పటికైనా సర్వే జరిపించి, నష్టపోయిన రైతులకి ప్రజలకి నష్టపరిహారం చెల్లించి, వారిని ఆదుకోవాలని న్యూడెమోక్రసీ- అఖిలభారత రైతు కూలీ సంఘం గా కోరుతున్నామన్నారు. అనంతరం తాహాసిల్దార్, ఏవో మాట్లాడుతూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వైఎస్ రెడ్డి, కొండపనేని సత్యనారాయణ, బర్ల రామకృష్ణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.