అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి 7.20 గంటలకు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి సుధీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు ఎట్టకేలకు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జూపూడి ప్రభాకర్‌రావు దిల్‌కుషా నుంచి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులకు జగన్‌ అరెస్టు విషయం తెలిపారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ బయటకు వెళ్లి తాజ్‌ కృష్ణా హోటల్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ సీబీఐ అధికారులతో చర్చించిన అనంతరం జగన్‌ను అరెస్టు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

విచారణలో వాన్‌పిక్‌కు భూముల కేటాయింపులు, భారతి సిమెంట్స్‌, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌, జగతి పబ్లికేషన్స్‌లలో పెట్టిన పెట్టుబడుల గురించి ఆరా తీసినట్టు సమాచారం. తొలి రోజు జగన్‌ను మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలతో కలిపి విచారించి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. రెండో రోజు జగన్‌ను, మోహిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిని కలిపి విచారించగా, మూడో రోజు జగన్‌ను, ఆడిటర్‌ విజయసాయిరెడ్డిని కలిపి విచారించారు.