అతుకుల బొంతగా మారిన రహదార్లు

ఖమ్మం, జూలై 25: పట్టణంలోని వైరా రోడ్డుపై బిటి రెన్యువల్‌ పనులు పూర్తి చేసి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే పనుల్లో నాణ్యతాలోపాలు కొట్టొచిన్నట్టు బయటపడ్డాయి. పైపై మెరుగులు దిద్దినట్లు పనులు ముగించడంతో రహదారి అతుకుల బొంతగా కనిపిస్తోంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపై వర్షం నిలుస్తోంది. పట్టణంలో శ్రీశ్రీ సర్కిల్‌ నుండి ఇల్లందు క్రాస్‌ రోడ్డు, కలెక్టరేట్‌, మయూరిసెంటర్‌, బస్టాంట్‌, జూబ్లీ క్లబ్‌ మీదుగా మున్నేరు వంతెన వరకు ఆరు కిలో మీటర్లు రోడ్డుపై తారుపోశారు. దీని కోసం రోడ్లు, భవనాల శాఖ రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. బిటి రెన్యువల్‌ పనులు చేపట్టిన సమయంలో వర్షం కురవడంతో రోడ్డు పనులకు ఆటంకం ఏర్పడింది. గుత్తెదారు వేసవి కాలమంతా ఖాళీగా ఉండి వర్షాలు కురిసే సమయానికి పనులు చేపట్టారు. వాస్తవానికి ఒకే సమయంలో తారుపోయరాదని నిబంధన ఉంది. వర్షపు జల్లుతోనే బిటి రెన్యువల్‌ పనులు చేశారు. బిటి వేసినా కూడా అతుకుల బొంతగా కనిపిస్తోంది. సరిగా స్లోపు లేక రోడ్డుపై గొంతలు ఏర్పడి నీరు నిలవడంతో రోడ్డులోపలికి నీరు ఇంకి గుంతలు పడుతున్నాయి. తారు సరిగా అతకనందున రోడంతా ధ్వంసమవుతోంది. ఈ రోడ్డు నాణ్యతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రోడ్లు, భవనాల శాఖ ఎఇ ఆనందరెడ్డిని వివరణ కోరగా గుత్తేదారుదే బాధ్యత అని అన్నారు.