అధికంగా పెన్షన్లు ఇస్తున్నది కాంగ్రెస్సే మంత్రి పితాని సత్యనారాయణ

ఏలూరు, జూలై 13 : పశ్చిమ గోదావరి జిల్లాలో 2004లో పెన్షన్లు కింద కేవలం 75 వేల రూపాయలు పేదలకు చెల్లిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 28.15 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ఆచంటలో శుక్రవారం వికలాంగుల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, 2004లో 41 వేల మంది పేదలకు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ల రూపంలో 75 వేల రూపాయలు చెల్లిస్తే నేడా కాంగ్రెస్‌ ప్రభుత్వం 3 లక్షల 32 వేల మంది పేదలకు 28 కోట్ల 15 లక్షల రూపాయల చెల్లిస్తుందని చెప్పారు. డాక్టర్‌ వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం నాటికి రాష్ట్రంలో రెండు లక్షల 91 వేల మంది పేదలకు పెన్షన్లు అందిస్తే ఈ రెండుళ్ల కాలంలో అదనంగా 42 వేల మందికి పెన్షన్ల సౌకర్యాన్ని కల్పించన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన చెప్పారు. 2003-04 ఆర్థిక సంవత్సరంలో వికలాంగులకు కేవలం 8 వేల 296 మందికి 75 రూపాయల పెన్షన్‌ ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 వేల 443 మంది వికలాంగులకు పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించి నేడు ఒక్కొక్కరికీ 500 రూపాయలు చెల్తిస్తున్నామని పితాని సత్యనారాయణ చెప్పారు. 2004లో 32 వేల 892 మందికి వృద్ధాప్య పెన్షన్లు కేవలం 75 రూపాయల చొప్పున ఇవ్వగా నేడు లక్షా 82 వేల 693 మందికి నెలకు 200 రూపాయల చొప్పున పెన్షన్‌ అందిస్తున్నామని ఆదేవిధంగా 79 వేల 956 మందికి వితంతువులకు, 3 వేల 335 మంది చేనేత కార్మికులకు, 1540 మంది గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పితాని సత్యనారాయణ అన్నారు. కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటివారి మాటలను నమ్మవద్దని ఆయన చెప్పారు. రోశయ్య హయాంలో గానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో గానీ ఏ పథకం ఆగిందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్న పథకాలను మరింత బలోపేతం చేసి అర్హత గల వారికి మరింత విస్తరిస్తున్నామని అయితే కొంతమంది కావాలనే ప్రజలను తప్పుదోవపట్టించడానికి పథకాన్ని ఆగిపోయాయని అంటున్నారని ఈ జిల్లాలో ఏఒక్కరికైనా పెన్షన్‌ ఆగిందా? చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు దుష్ప్రచారం విడనాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా ఏచిన్న లోపాలు ఉన్నావాటిపై నిర్మాణత్మకమైన సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందించాలే తప్ప కావాలని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని విడనాడాలని పితాని హితవు పలికారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని బడుగు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని పేద విద్యార్థిని, విద్యార్థులవిద్య కోసం వేలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్‌ అందించడంలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఆయన చెప్పారు. వికలాంగులు వివాహం చేసుకుంటే గతంలో వచ్చే పారితోషికం పదివేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. 40 శాతం పైబడి అంగవైకల్యం కలిగిన వికలాంగులకు సంక్షేమ పథకాలు ప్రస్తుతం అమలు చేస్తున్నామని అయితే 40 శాతం కన్నా తక్కువ ఉన్న వికలాంగులకు కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో అవకాశం కల్పించడానికి ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే చర్చించిందని ఇందిరమ్మబాట కార్యక్రమంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందని త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి వికలాంగులకు మరింత చేయూత అందిస్తామని పితాని సత్యనారాయణ చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వాణీమోహన్‌ మాట్లాడుతూ, జిల్లాలో వికలాంగులకు వివిధ వృత్తుల్లో శిక్షణ అందించే కార్యక్రమాన్ని రెండు నెలల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వృత్తి శిక్షణలో నైపుణ్యాన్ని పెంచుకుని వికలాంగులు స్వశక్తిపై జీవించే స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ కోరారు.