అపరాల సాగు పెంపునకు యత్నం

ఖమ్మం, డిసెంబర్‌ 8 : ఖమ్మం జిల్లాలో అపరాల సాగు పెంచేందుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు ఖమ్మం జెడిఎ రఫీ అహ్మద్‌ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని అన్నారు. ఈ రబీలో దీనిని పెంచడానికి రైతులకు రాయితీపై మినుములు, పెసలు, ఇతర విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే రబీలో పెసలు 2694 హెక్టార్లలో, మినుములు 3984 హెక్టార్లలో సాగుచేశారని అన్నారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతులు అపరాల సాగుకు ప్రయత్నించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో అపరాలను అత్యధికంగా పండించి రాష్ట్రంలోని మొదటిస్థాయిలో నిలిచేందుకు కృషి చేస్తామని జెడిఎ రఫీ తెలిపారు.