అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి

అమెరికా కాన్సులేట్‌ వాహనం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
ఇస్లామాబాద్‌: అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు అమెరికన్లు సహా 19 మంది గాయపడ్డారు. 110 కిలోల పేలుడు పదార్థాలను నింపిన కారును ఆత్మాహుతిదళ సభ్యుడు అమెరికా దౌత్య కార్యాలయ వాహనంపైకి పోనిచ్చి పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక వాహనం కావడంతో అందులో ఉన్న ఇద్దరు అమెరికన్లు, మరో ఇద్దరు పాకిస్థానీ ఉద్యోగులు గాయాలతో తప్పించుకోగలిగారు. పేలుడు ధాటికి రహదారిపై ఐదడుగుల మేర గొయ్యి ఏర్పడింది. అత్యాధునిక వాహనం కావడంతో అమెరికన్లు తప్పించుకోగలిగారని, గాయాలపాలైన వారిని వెంటనే దౌత్య కార్యాలయానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ పేలుడుకు తమదే బాధ్యతని ఎవరూ ప్రకటించలేదు. మరోవైపు ఘటనలో ఇద్దరు అమెరికన్లు మరణించినట్లు సమాచార మంత్రి మియాన్‌ ఇఫ్తికార్‌ హుస్సేన్‌ ప్రకటించగా అమెరికా మాత్రం తమ సిబ్బంది ఎవరూ మరణించలేదని తెలిపింది.