అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందించాలి
కరీంనగర్, జూలై 25 : పట్టణంలో మరికొందరు అర్హత కలిగిన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట అర్హులైన వృద్ధ మహిళలు, పురుషులు ధర్నా నిర్వహించారు. గతంలో వృద్ధాప్య పెన్షన్లు కొందరికే మంజూరు చేశారని, ప్రస్తుతం అర్హులైన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, దీంతో తాము అనేక అవస్థలు పడుతున్నామని వారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్‌దారులకు ఇస్తున్న పెన్షన్లలోనే కొందరికి రద్దు చేస్తున్నారని వాపోయారు. తాము పెన్షన్లు పొందేందుకు అర్హులం కాదా అని ప్రశ్నించారు. ప్రజల కోసం అనేక సంక్షేమం పథకాలు ప్రవేశిపెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప తమలాంటి వృద్ధ మహిళలకు పెన్షన్లు అందడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పెన్షన్లను అందించే సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కోత విధిస్తున్న పెన్షన్‌దారులను కూడా దృష్టిలో ఉంచుకొని పూర్తి పెన్షన్ అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పెన్షన్‌దార్లు ఆర్డీఓకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోకపోతే ఫలితం మరోలా ఉంటుందని హెచ్చరించారు.