అస్సాంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం బాలిక వేధింపు ఘటనలో నలుగురి అరెస్టు
గౌహతి, జూలై 13 (: అస్సాంలో బాలికపై కొంత మంది దుండగులు దారుణంగా మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ఓ చానల్ రిపోర్టర్ ఈ వేధింపుల ఘటనను వీడియో తీసి ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనలో జోక్యం చేసుకుని ఒక కమిటీని సైతం అస్సాంకు పంపించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఈ ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. గౌహతిలోని షిల్లాంగ్ రోడ్డులో ఉన్న ఓ బార్‌కు సోమవారం రాత్రి ఓ బాలిక తన స్నేహితురాలితో కలిసి వచ్చింది. ఆ సమయంలో ఆ బార్లో తప్పతాగి ఉన్న 11 మంది యువకుల బృందం ఆ బాలికను చుట్టుముట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శారీరకంగా వేధింపులకు గురిచేశారు. ఆ బాలిక వేసిన ఆక్రందనను పట్టించుకునే వారే కరువయ్యారు. చివరకు స్థానికులు మేల్కొని పోలీసులకు తెలియజేయడంతో పోలీసుల రాకను గమనించిన దుండగులు పరారయ్యారు. కాగా ఈ దారుణమైన ఘటనను వీడియో తీసిన స్థానిక లోకల్ టీవీ రిపోర్టర్ ఈ ఘటన దృశ్యాలను చానల్లో ప్రసారం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం సస్పెండ్ చేయాల్సిందిగా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ డిమాండ్ చేసింది. చివరకు పోలీసులు ఆ వీడియో క్లిప్పింగ్‌లను తెప్పించుకుని యువకులను గుర్తుపట్టే ప్రయత్నాలు చేయడంలో కూడా కొంతమేరకు విఫలమయ్యారు. శుక్రవారం నాటికి నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు. మిగిలిన దుండగుల ఫొటోలను పోస్టర్లు వేసి అస్సాంలో వీధివీధికి అంటించడం జరిగింది. దీనిపై అస్సాం డీజీపీ జయంత్ నారాయణచౌదరి మాట్లాడుతూ ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని, ఈ దారుణ ఘటనను వెలుగులోకి తెచ్చిన లోకల్ రిపోర్టర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకుని పోకిరీలు రెచ్చిపోతే సహించేది లేదని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. కాగా ఈ ఘటనపై వెల్లువెత్తిన నిరసనకు ప్రభుత్వం కూడా తలొగ్గాల్సి వచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి గగోయ్ దీనిపై మాట్లాడుతూ నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని, బాలికను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావని మహిళా కమిషన్ ప్రస్తుత చైర్మన్ మమతా శర్మ, మాజీ చైర్పర్సన్ జయంతి నటరాజన్ పేర్కొన్నారు.