ఆగిన అందెలు..గురువు వెంపటి చినసత్యం ఇకలేరు!

సంతాపం వెలిబుచ్చిన నాట్యకోవిదులు..అతిరథులు
చెన్నయ్‌, జూలై 29 (జనంసాక్షి) : ఆగిన అందెలు.. తన జీవితాన్ని కూచిపూడి నాట్యానికే అంకితం చేసిన నాట్యకళాకోవిదుడతడు.. కూచిపూడి నాట్యానికి శాస్త్రీయత రూపకకర్త అతడు.. ప్రాచీన కళకు మెరుగులు దిద్ది కొత్త సొబగులు అద్దిన పురాణ పురుషుడతడు.. మారుమూల ఉన్న పల్లె పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నాట్యాచారుడతడు.. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన లయకారకుడతడు.. ఆయనే వెంపటి చినసత్యం. ఆదివారం ఉదయం తన స్వగృహంలో పరమపదించారు. ఆయన ఇకలేరు అన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన శిష్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అపురూపమైన మూకాభినయం.. శారీరక అంగీకాభినయం ఆయన సొంతం. కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు.
1929, అక్టోబర్‌ 25వ తేదీన కృష్ణా జిల్లా కూచిపూడిలో వెంపటి చినసత్యం జన్మించారు. ఆరేళ్ల వయస్సులోనే నాట్య అభ్యాసానికి శ్రీకారం చుట్టారు. వేదాంతం లక్ష్మీనారాయణ వద్ద శిష్యరికం నెరిపారు. కూచిపూడి నృత్యంలో ఓనమాలు దిద్దుకున్నారు. తాడేపల్లి పాపయ్యశాస్త్రి వద్ద కూడా అభ్యసించారు. స్వయం ప్రతిభతో ఆ నాట్యానికి కొత్త సొబగులు అద్ది అజరామరమైన కీర్తిని సాధించారు. 1963లో మద్రాసులో కూచిపూడి ఆర్ట్‌ అకాడమీని స్థాపించారు. ఎందరికో నాట్యవిద్యను ప్రసాదించారు. వారిలో ప్రముఖ నటీమణులు రేఖ, హేమామాలిని, వైజయంతిమాల, చంద్రకళ, మంజుభార్గవి, ప్రభ, శోభానాయుడు, కేంద్ర మంత్రి పురందరేశ్వరి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తదితరులు ఉన్నారు. 180 నృత్యాలను, 15 నృత్య రూపకాలను ఆద్యుడయ్యారు. పద్మావతీ శ్రీనివాస కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, హన విలాసం..లకు నృత్య రూపకాల సృష్టికర్త. టీటీడీలో ఆస్థాన నాట్యాచారుడిగా కొంతకాలం పనిచేశారు. ఇదిలా ఉండగా నర్తనశాలలో ఎన్టీఆర్‌కు నృత్యాన్ని నేర్పారు. అలాగే శ్రీకృష్ణవిజయంలో హేమమాలిని చేత ‘జోహారు..’ అనే గీతానికి నృత్య రూపకల్పన గావించారు. ఏకలవ్యలోని ‘వినుడు వినుడు.. రామాయణ గాథ.. మనసారా’ అన్న గీతానికి రూపకల్పన చేసింది ఆయనే. ఇలా 100 చిత్రాలకు తన సోదరుడు వెంపటి పెద సత్యంతో కలిసి నృత్య దర్శకత్వం వహించారు. జిలుగు వెలుగుల మధ్య ఇమడలేక చిత్రాలకు స్వస్తి పలికి కూచిపూడి నాట్యభున్నతికే తన జీవితాన్ని అంకితం చేశారు. 1956లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం కళైమామణి, ఎస్‌వి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసి సన్మానించింది. ఆంధ్రా యూనివర్శిటీ కళాప్రపూర్ణ బిరుదుతో ఆయన్ను గౌరవించుకుంది. ఇంకా ఎన్నెన్నో అవార్డులు ఆయన్ను వరించాయి.
పలువురి సంతాపం
వెంపటి చిన సత్యం కన్నుమూత పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరని లోటు అని కేంద్ర మంత్రి పురందరేశ్వరి అన్నారు. కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన వెంపటి చినసత్యం సేవలు అపూర్వమని, ఆయన మరణం నాట్య ప్రపంచానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి సంతాపం వెలిబుచ్చారు. అదేవిధంగా నృత్య కళాకారిణి శోభానాయుడు, నటీమణులు మంజుభార్గవి, ప్రభ, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. కూచిపూడి నాట్యానికి శాస్త్రీయత తెచ్చిన మహానుభావుడు వెంపటి చినసత్యం అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన వద్ద నాట్య అభ్యసించిన వారెందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, తామందరం ఆయన నాట్యానికి ప్రతిరూపాలమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సానుభూతి తెలిపారు.