ఆత్మహత్యలకు కాంగ్రెసే బాధ్యత వహించాలి
ఆదిలాబాద్, నవంబర్ 10 ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకోవద్దని ఉద్యమం ద్వారానే తెలంగాణను సాధించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న జిల్లాకు చెందిన సంతోష్‌కు పార్టీ తరఫున నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని కేంద్రం నాన్చడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. యువకుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీల వైఖరివల్ల తెలంగాణ ఏర్పాటు ఆలస్యమవుతుందని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన డిమాండ్ చేశారు.