ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ కన్నుమూత

చత్తీస్‌గఢ్‌, సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కెఎస్‌ సుదర్శన్‌ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో నేటి ఉదయం మరణించారు. ఆయన 1931, జూన్‌ 18న చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు కుప్పల్లి సీతారామయ్య సుదర్శన్‌. ఆయన తన చిన్న వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1954 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక పదవులు నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా చాలా కాలం పనిచేశారు. 2000-09 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌గా సుదర్శన్‌ పనిచేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన 2009, మార్చి 31న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ పదవి నుంచి వైదొలిగారు. ఎన్డీఎ ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి, అద్వానీ, తదితరులకు ఎన్నో సలహాలు, సూచనలు అందజేశారు. ఇదిలా ఉండగా సుదర్శన్‌ మృతి పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, శివసేన సీనియర్‌ నేతలు సంతాపం తెలిపారు. సుదర్శన్‌ అంతిమయాత్ర ఆదివారం కొనసాగనున్నట్టు తెలిసింది.