ఆస్తులను పరిరక్షించండి

ఖమ్మం, జూలై 27 : ఆస్తుల పరిరక్షణలో అలసత్వం వహిస్తున్న పురపాలక సంఘం అధికారులు.. ఖమ్మం పురపాలక సంఘం ఆస్తుల రక్షణను అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో కొన్ని తుప్పు పట్టి పాడవుతుండగా.. మరికొన్ని పనికిరాకుండా పోతున్నాయి. స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి.. ఆ స్థలాలు ఎక్కెడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునిసిపాలిటీకి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే కమిషనర్లు తదితర విభాగాల అధికారులు ఎవరికి వారు తమ కుర్చీలను కాపాడుకోవడంలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డబుల్‌ ఎంట్రీ విధానం ద్వారా మునిసిపాలిటీకి సంబంధించిన కదిలే ఆస్తులు, కదలని ఆస్తులు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని మునిసిపల్‌ నిబంధనలు ఉన్నా వాటిని కూడా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆరేడు దశాబ్దాల క్రితం సింగిల్‌ ఎంటరీ విధానంలో మునిసిపల్‌ ఆస్తుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసినా అవి కాలదోషం పట్టి పాడయ్యాయి. ఇకపోతే మునిసిపల్‌ స్థలాల వంటి విలువైన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను మాయం చేశారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఈ తరహా అక్రమాలను అడ్డుకునేందుకు ఆస్తులను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని ్ష్మప్రభుత్వం మునిసిపాలిటీలను ఆదేశించినా కూడా ఆ మేరకు స్పందన కరువైంది. ఖమ్మం పట్టణంలో మునిసిపల్‌ స్థలాలను అయిదారు దశాబ్దాల క్రితం కొందరికి లీజుకు ఇచ్చారు. వాటి లీజు గడువు పూర్తయ్యాక కూడా స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో మునిసిపల్‌ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. త్రీ టౌన్‌ ప్రాంతంలోని గాంధీచౌక్‌, శ్రీనివాసనగర్‌, ప్రకాష్‌నగర్‌, వైరారోడ్డు తదితర ప్రాంతాల్లో మునిసిపల్‌ స్థలాలను రైస్‌మిల్లు, ఆయిల్‌మిల్లులు తదితర వ్యాపార వాణిజ్యం కోసం అప్పటి పాలకవర్గం లీజుకు ఇచ్చింది. లీజు పొందినవారిలో పలువురు మృతి చెందగా.. ఆ స్తలాలు వారి వారసుల ఆధీనంలో ఉన్నాయి. గడువు ముగిసిన అనంతరం వాటిని మునిసిపాలిటీకి అప్పగించడంలో స్థలాలు ఆమ్రణలకు గురయ్యాయి. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీకపోవడంతో ఆటోస్టాండ్లు, పార్కింగ్‌ ప్రదేశాలు, వంటి ఏర్పాట్లతో పాటు రైతుబజార్లు, తదితర సదుపాయాలకు స్థలం కరువవుతోంది. ఈ విషయమై గత కౌన్సిల్‌ సభ్యులు అధికారులపై ఒత్తిడి తేవడంతో కొంత కృషి జరిగినా ఈలోగా పాలకవర్గం పదవీ కాలం పూర్తవ్వడం అప్పటి కమిషనర్‌, ప్రణాళిక వివాదం మారిపోవడంతో స్థలాల స్వాధీనం మరుగునపడింది. స్థలాలతో పాటు వాహనాలు, శిధిల పరికరాలు వంటివి కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా ఆ పని చేయలేదు. మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో పాత వాహనాలు, రిక్షాలు, విడి భాగాలను తూకం వేసి విక్రయించాలని అధికారులు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇకనైనా మునిసిపల్‌ అధికారులు దృష్టి పెట్టి మునిసిపల్‌ ఆస్తుల పరిరక్షణకు నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు.