ఆస్పత్రుల్లో త్వరలో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ: మంత్రి హరీష్‌రావు
ఆస్పత్రుల్లో త్వరలో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ: మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ‘ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్’లో ఆయన మాట్లాడారు. పేట్ల బురుజు మాదిరిగానే ప్రతి ఆస్పత్రి ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. పేట్ల బురుజు ఆస్పత్రికి ఎక్కువగా క్రిటికల్ కేసులు వస్తాయని, కాబట్టి ఇక్కడ మరణాల సంఖ్య పెరగకుండా చూడాలని సంబంధిత అధికారులను, వైద్య సిబ్బందిని మంత్రి కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది బాలింతలు, గర్భిణిలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వచ్చే నెలలో నిమ్స్ ఆస్పత్రిలో ఎంసీహెచ్ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ఎంసీహెచ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచామని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో గర్భిణీల్లో సమస్యలను గుర్తిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేగాక మాతాశిశు మరణాలపై లోతైన విశ్లేషణ చేయాలని సూచించారు. అంతేగాక, రాష్ట్రంలో త్వరలోనే 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.