ఇదో అద్భుతం

C

24 గంటల్లో ఫిష్‌ ప్లేట్ల తొలగింపు,

రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ .

పైప్‌ లైన్‌ నిర్మాణం పూర్తి .

అభినందించిన మంత్రి హరీష్‌ రావు .

కరీంనగర్‌,జూన్‌ 19(జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లా నీటిపారుదల శాఖ యంత్రాంగం  సాధించిన అద్భుతం.ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో ఈ విజయం లభించింది.  గంగాధర – పూడూరు రైల్వే స్టేషన్ల మధ్య  ‘రైల్వే క్రాసింగ్‌’ సమస్య ను ఇరిగేషన్‌ అధికారులు కేవలం 24 గంటల్లో అధిగమించి పైపులు బిగించారు. మూడు రోజుల పాటు సన్నాహాలు చేసి  6 ఫిష్‌  ప్లేట్లను తొలగించి 24 గంటల్లో ట్రాక్‌  పునరుద్ధరించి సంచలనం సృష్టించారు. ఇందుకోసం ఇరిగేషన్‌, రైల్వే , కాంట్రాక్ట్‌ సంస్థల సిబ్బంది మూడు రోజులు నిద్ర లేకుండా గడిపారు. పలు సమస్యలు, సవాళ్ళు ఎదురైనా నిర్ణీత సమయానికి పనులు పూర్తిచేసి అరుదైన విజయం సొంతం చేసుకున్నారు. గంగాధర , కొడిమ్యాల చెరువుల నుంచి రైతుల ఆయకట్టుకు నీరందించడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ రెండు చెరువులు కరీంనగర్‌ – నిజామాబాద్‌ రైల్వే లైను మధ్యలో ఉన్నాయి. రైల్వే ట్రాక్‌ ను  దాదాపు 50 విూటర్ల మేరకు తొలగిస్తే తప్ప గంగాధర – కొడిమ్యాల చెరువుల నుంచి సాగునీటి సరఫరాకు పైపులైన్ల ను అమర్చలేరు. ఈ నేపధ్యంలో జూన్‌ 15 న ఉదయం 7.30 గంటలకు ఈ మార్గంలో రైలు వెళ్లిపోయిన తర్వాత  ఇరిగేషన్‌ అధికారులకు ,రైల్వే అధికారులు  క్లియరెన్స్‌ ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. అక్కడ ఊహించని విధంగా బండరాళ్ళు అడ్డు రావడంతో బ్లాస్టింగ్‌ చేశారు. 16వ తేదీ సాయంత్రం మట్టి పెళ్లలు విరిగి పడడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇరిగేషన్‌ పైపులైన్ల ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. రైల్వే డివిజనల్‌ ఇంజనీర్‌ శర్మ సహా కొందరు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు కరీంనగర్‌ స్టేషన్లో రైల్వే, ఇరిగేషన్‌ అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు ఐ. వి.ఆర్‌. సి.ఎల్‌, నవయుగ , స్యు  ప్రతినిధులు సమావేశమై చర్చించారు. 24 గంటల్లో ట్రాక్‌ పై రాకపోకలు సాగాలని రైల్వే అధికారులు టార్గెట్‌ విధించారు. ప్రతి రెండు గంటలకు ఏయే పనులు ఎలా పూర్తి చేయాలో కార్యాచరణను ఖరారు చేశారు. 17 ఉదయం మళ్లీ ‘ఆపరేషన్‌ ‘ ప్రారంభించారు. 50 విూటర్ల రైల్వే ట్రాక్‌ ను తొలగించారు. 9 సార్లు బ్లాస్టింగ్‌ జరిపి బండరాళ్ళు తొలగించారు. విజయవంతంగా పైపులైన్‌ నిర్మించారు. 17 వ తేదీ రాత్రి 8 గంటలకల్లా ‘ఆపరేషన్‌’ పూర్తయింది. అదే రాత్రి ఆ మార్గంలో 10.45 గంటలకు రైలు నడిపారు. ఈ ‘ ఆపరేషన్‌’ సక్సెస్‌ చేసేందుకు భారీ యంత్ర సామాగ్రి, క్రేన్లు , పేలుడు పదార్ధాలు వాడారు.నీటిపారుదల ప్రాజెక్టులకు ఎదురవుతున్న రైల్వే క్రాసింగ్‌ సమస్యలపై ఇటీవల ఇరిగేషన్‌ మంత్రి టి.హరీష్రావు రైల్వే అదికారులతో సవిూక్షించిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు  ఆయకట్టు పరిధిలోని రైల్వే క్రాసింగ్‌ పనులకు మోక్షం లభించింది. అనేక చిక్కులు , సవాళ్ళు ఎదుర్కున్నా 24 గంటల్లో ఇరిగేషన్‌ అధికారులు, సిబ్బంది కష్టనష్టాల కోర్చి విజయం సాధించినందుకు మంత్రి హరీష్‌ రావు ఈ ‘ఆపరేషన్‌’ లో పాల్గొన్న వారందరినీ అభినందించారు.ఇందులో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు శర్మ, పియూష్‌ , శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఇ వెంకట రాములు, ఇ.ఇ. పి.శివకుమార్‌, డి.ఇ.ఇ. ఎం.ఏ. రఫీ, ఎ.ఇ.ఇలు వి.గంగాధరరావు , ఉపేందర్‌ రావు, ఇతర సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్‌ ప్రాజెక్టుల సి.ఇ. అనిల్‌  పర్యవేక్షించారు. ఈ మొత్తం ప్రక్రియను మంత్రి హరీష్‌ రావు నిరంతరం ‘వాట్సాప్‌’ గ్రూప్‌ లో సవిూక్షించారు.