ఇస్రో నుంచి త్వరలో కొత్త రాకెట్ల ప్రయోగం ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌

అనంతపురం: సెప్టెంబర్‌ రెండో వారంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రెండు కొత్త రాకెట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్‌ అందుకునేందుకు అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.పీఎస్‌ఎల్వీ-సి-21 రాకెట్‌ ద్వారా ఫ్రాన్స్‌, జపాన్‌లకు చెందిన రెండు ఉపగ్రహల్ని, అలాగే జీశాట్‌-10 పేరుతో సమాచార వ్యవస్థకు సంబందించిన మరో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తామని వివరించారు. మరో వైపు 2010లో విఫలమైన జీఎస్‌ఎల్‌వీని మార్పులు చేర్పులతో ఈ నవంబరులో మరోసారి ప్రయోగిస్తామని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఇస్రో పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతాయని తెలిపారు.