ఉపసంఘం సిఫార్సులు అభ్యంతరకరం : వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి): బిసి విద్యార్థులకు ఫీజు చెల్లింపుల్లో కోత విధించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులను కాంగ్రెస్‌ సినియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుపట్టారు. బుధవారం నాడు ఆయన ఇక్కడ మీడియాతో ముచ్చటించారు. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి దండుగా నిలిచిన బిసి వర్గాలకు అన్యాయం చేసే విధంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సిఫార్సులపై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించి పాత విధానాన్నే కొనసాగించాలని విహెచ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సిఫార్సుల వల్ల లక్షలాదిమంది బిసి విద్యార్థులు నష్టపోతారని అన్నారు. రీయింబర్స్‌మెంట్‌ వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని, అందువల్ల ఫీజులలో కోత విధించాలన్న నిర్ణయం సరైనది కాదన్నారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో ప్రకటిస్తున్న పథకాలు, వరాలతో డబ్బు ఉండగా బిసి విద్యార్థుల ఫీజు చెల్లింపునకు ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని సరైన నిర్ణయం ప్రకటించాలన్నారు. ఓ వైపు తెలుగుదేశంపార్టీ బిసి డిక్లరేషన్‌ అంటూ హడావుడి చేస్తుంటే, కాంగ్రెస్‌ మంత్రులు బిసి వర్గాల సౌకర్యాన్ని కాలరాయడం తగదని, పార్టీకి నష్టం కలిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపసంఘ సిఫార్సుల పట్ల బిసి మంత్రుల ఆవేదన సహేతుకమేనని వారిని తప్పు పట్టాల్సిన పని లేదన్నారు