ఉమేశ్‌కుమార్‌ పై వారంట్‌ జారీ

హైదరాబాద్‌ : ఓ ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌పై నాంపల్లి కోర్టు గురువారం వారెంట్‌ జారీ చేసింది. ఎంఏ ఖాన్‌ అనే పార్లమెంట్‌ సభ్యుని సంతకాన్ని ఫోర్జరీ చేసి దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన కేసులో ఉమేశ్‌ కుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు ఉమేశ్‌కుమార్‌, మాజీ జర్నలిస్టు సునిల్‌రెడ్డి తదితరులపై అభియోగపత్రం దాఖలు చేశారు. ఛార్జిషీటును విచారణకు స్వీకరించిన నాంపల్లి చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఉమేశ్‌కుమార్‌కు సమన్లు జారీ చేశారు. అయితే ఉమేశ్‌ కుమార్‌ విచారణకు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందుకు కోర్టు అనుమతించినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో వారంట్‌ జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.