ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి):
గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం చారు. ఈ మేరకు వారు లిఖితపూర్వకంగా ఎయిర్‌ఇండియా యాజమాన్యానికి తమ నిర్ణయాన్ని తెలిపారు. తాము తిరిగి విధుల్లో చేరతామని చెప్పారు. సమ్మెలో పాల్గొన్న 434 మంది పైలట్లు తాము తిరిగి విధుల్లో చేరతామని పేర్కొన్నారు. అంతకుముందు విధుల్లో తొలగించిన వంద మందికి పైగా పైలట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. తక్షణమే తాము సమ్మెను ఉప సంహరించుకుంటున్నట్లు ఆందోళన చేస్తున్న పైలట్లు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తొలగించిన పైలట్లను విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని ఎయిర్‌ఇండియా యాజమాన్యం కోర్టుకు హామీ ఇచ్చింది. కాగా ఈ సాయంత్రం కోర్టు ఉత్తర్వులు అందాక సమ్మెను విరమిస్తారని పైలట్ల సంఘ వర్గాలు తెలిపాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పైలట్లు తాము 48 గంటల్లోగా విధులకు హాజరవుతామని అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. యాజమాన్యాన్ని, పైలట్లను ఆరవ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు కలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు వీలుగా చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఒక సమన్వయ అధికారిని నియమించారు. దీంతో 58 రోజులుగా సాగుతున్న పైలట్ల సమస్యకు తెరపడనుంది.