ఎర్రబెల్లిని అక్రమాలను అడ్డుకుందాం

భారీ మెజార్టతో గెలిపించాలి: యశస్విని రెడ్డి పిలుపు
జనగామ,నవంబర్‌27 (జనంసాక్షి) : ఈ ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలని పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్నా యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. పాతుకు పోయి ప్రజలను పట్టించుకోని ఎర్రబెల్లిని
వదిలించుకోవాలని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యశస్వినిరెడ్డి కోరారు. మంత్రి దయాకర్‌ రావు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆయనకు బై బై చెప్పే టైం ఆసన్నమైందన్నారు. తాను ఎన్నికల బరిలో నిలబడేందుకు ప్రయత్నించగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు అడ్డుకున్నారని ఆరోపించారు. తాము సంపాద కోసం రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే బరిలో నిలిచామని స్పష్టం చేశారు. అభివృద్ధి ముసుగులో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పేదల భూములను అక్రమిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగినా విచారణ సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ లీడర్లపై సీబీఐ, ఈడీ ఆఫీసర్లను ఉసిగొల్పు తున్నారన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో లక్షల కోట్ల విలువైన వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధరణిలోని లోపాలతో భూములను కబ్జా చేస్తున్నారన్నారు. ప్రజల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే భోగాలు అనుభవిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల యువతగా ముందుకు వచ్చిన తనను గెలిపించాలంటూ ఆమె ప్రచారంలో ప్రజలను కోరారు.