కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉంది
` జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించక తప్పదు
` పండగల వేళ అప్రమత్తంగా ఉండాల్సిందే..
` మరోమారు డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
న్యూఢల్లీి,అక్టోబరు 6(జనంసాక్షి):ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికీ దీనిపట్ల జాగ్రత్తలు అవసరమేనని అన్నారు. కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, ఆ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడలేదు అని స్పష్టం చేసింది. గత వారం ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల మందికి కరోనా సోకగా, 54 వేల మంది మరణించినట్లు తెలిపింది. కొన్ని దేశాల్లో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కొందరేమో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఈ రెండేళ్లలో కరోనా కాటుకు 50 లక్షల మంది బలయ్యారని పేర్కొంది. టీకా తీసుకోని వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. కరోనా విషయంలో అజాగ్రత్త ఏ మాత్రం మంచిది కాదు అని డబ్ల్యూహెచ్వో తెలిపింది. రానున్న కాలంలో మరింత జాగరూకతతో ఉండాల్సిందేనని తెలిపింది. ఇదిలావుంటే ఎయమ్స్ చీఫ్ గులేరియా కూడా రెండ్రోజుల క్రితం ఇదే విషయాన్ని చెప్పారు. రానున్న పండగల వేళ అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. ఇకపోతే ప్రజల్లో చైతన్యం పెరగడంతో దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది.