కాలనీ సమస్యలు తీరడంలేదు

పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద
మండిపడుతున్న సామాన్యులు
వరంగల్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో
సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బల్దియా అధికారులకు పన్నుల వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ వసతుల కల్పనపై లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన దాఖాలాలు లేవని, ఎక్కడి చెత్త అక్కడనే ఉంటుందని, కనీసం కార్పొరేషన్‌ అధికారులు తడి, పొడి చెత్తలను వేరు చేసే బుట్టలను ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో నూతన గృహ నిర్మాణాలు, అధిక సంఖ్యలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్నా కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించకపోవటంతో ఇబ్బందులకు గురవుతన్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని రోడ్లపై గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ రోడ్లపై వాహనాలు, పాదాచారులు నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లన్నీ మట్టి రోడ్లు కావటంతో వాహనాలు వెళ్తుంటే వచ్చే దుమ్ముతో స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక వర్షకాలం వరద వల్ల గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. అయినా నేటి వరకూ గుంతలు పూడ్చేందుకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో ఎవరి ఇంటిముందు వారే స్వతాగ మురికి కాలువలు నిర్మించుకున్నారని, ఎక్కడా మురికికాలువలు నిర్మించిన దాఖలాలు లేవని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస సరిగా లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలా కాలనీల్లో ఇప్పుటీ వరకు తాగునీరు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు.