కాలరాస్తే.. ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 :గిరిజన హక్కులను కాలరాస్తే సహించేది లేదని, అవసరమయితే ఉద్యమిస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ హెచ్చరించారు. గత డీఎస్సీలో బోగస్‌ ఏజెన్సీ ధృవీకరణ ప్రతాల పేరిట ఉపాధ్యాయులుగా ఎంపికైన 33 మంది అభ్యర్థులను విచారణ కమిటీ గుర్తించి వారందరినీ ఉద్యోగం నుండి తొలగించినప్పటికీ 2012 డిఎస్సీలో మళ్లీ ఆ అభ్యర్థులనే అధికారులు ఎంపిక చేయడం శోచనీయమన్నారు. దీని వల్ల ఆదివాసీ గిరిజనులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. నఖిలీ అభ్యర్థులను డిఎస్సీలో మళ్లీ ఎందుకు ఎంపిక చేశారని అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఆదివాసులకు ఉపాధి ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నా జిల్లా కలెక్టర్‌ మౌనంగా ఉండడం సరికాదన్నారు. వెంటనే దీనిపై పూర్తి విచారణ చేపట్టిన సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.