కాశ్మీర్‌ భారత్‌దే

లాహోర్‌: పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత భూభాగమేనని ఆ దేశానికి చెందిన ఓ అట్లాసులో ప్రచురించిన మ్యాపులో పేర్కోన్నారు. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం కూడా భారత్‌కు చెందినదే అందులో స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం ప్రచురించిన ఈ అట్లాసుపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌పై ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జరిగిన పొరపాటును గ్రహించి నాలిక్కరుచుకున్న అధికారులు రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు, గ్రంథాలయాల నుంచి ఆ అట్లాసులను వెనక్కి తెప్పించే ప్రయత్నాల్లో పడ్డారు. మొత్తం 15వేల ప్రతులు పాఠశాల గ్రంథాలయాలకు పంపీణీ చేశారు. ఈ అట్లాసు ముద్రణ, దానికి ఆమోదం, పంపీణీ వ్యవహారాల్లో బాధ్యులైన అందరి పైనా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. సరైన మ్యాపులతో తిరిగి అట్లాసులను ముద్రించాలని ప్రచురణకర్తను కోరామని తెలిపింది. భారత్‌లో పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పేర్కోనే ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో స్వతంత్ర కాశ్మీర్‌గా వ్యవహరిస్తారు.