కుటుంబ సమస్యతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల : గాంధీనగర్‌కు చెందిన ఉజ్వల (23) కుటుంబ సమస్యలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రాంబాబు, లక్ష్మీల పెద్ద కుమార్తె ఉజ్వల. వీరికి మరో కుమార్తె, కొడుకు ఉన్నారు. ఉజ్వలకు మొదటి నుంచి చదుపుపై ఆసక్తి. డిగ్రీ పూర్తి చేసింది. కుమార్తె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమె పై చదువులకు అంగీకరించారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో పీజీలో చేరి ఆర్గానిక్‌ కెమిస్ట్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల చిన్నాన్న గంగాధర్‌తో జరిగిన భూతగాదాలో తండ్రి కాలు విరిగి ఆస్పుతి పాలయ్యాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారాయి. వీటన్నింటిని చూసి తీవ్ర మనస్థాపంతో ప్రాణం తీసుకుంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. పట్టణ ఎస్సై శ్రీనూనాయక్‌ కేసు నమోదు చేసుకున్నారు.