కులగణన చేద్దాం.. స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం

` దేశానికి రోల్‌మోడల్‌గా ప్రక్రియ
` ఇది ఎక్స్‌రే మాత్రమే కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిది
` రాహుల్‌ హామీ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
` నవంబర్‌ 6 ప్రారంభించి 31లోగా ముగిస్తాం
` సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి
` కులగణనపై  నవంబర్‌ 5 లేదా 6 న రాష్ట్రస్థాయి సమావేశం
` ఇది భవిష్యత్‌ జగనగణనకు ఈ సర్వే ప్రామాణికం కానుంది
` ఈ మేరకు డాక్యుమెంటును కేంద్రానికి పంపుతాం
` గాంధీభవన్‌లో పార్టీ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వం చేపట్టబోతున్న బిసి కులగణన దేశానికే రోల్‌ మోడల్‌గా మార్చాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బిసి కులగణన హావిూని నిలబెట్టుకోవడం ద్వారా తెలంగాణను ఆదర్శంగా నిలుపుదామని అన్నారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కులగణనపై గాంధీభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి పార్టీ సమావేశంలో పాల్గొన్న సీఎం.. పక్రియపై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన తెలంగాణను మోడల్‌గా పరిగణనలోకి తీసుకునేలా డాక్యుమెంటును కేంద్రానికి పంపుతామని వివరించారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది ప్రత్యేక అబ్జర్వర్లను నియమించాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. బాధ్యతగా పనిచేయాలని కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా పార్టీ క్షమించదని హెచ్చరించారు. నవంబర్‌ 31లోగా పక్రియ పూర్తి చేసి భవిష్యత్తు యుద్దానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ నుంచి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాల్సి ఉందని స్పష్టం చేశారు. కులగణన ఎక్స్‌రే మాత్రమే కాదని అది మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్‌ విధానమని స్పష్టం చేశారు. నవంబర్‌ 6 నుంచి తెలంగాణలో కులగణన పక్రియను ప్రారంభించ నున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. నవంబర్‌ 6న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈమేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉంది. త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. రాహుల్‌ గాంధీ హావిూ మేరకు కులగణన చేస్తున్నామన్నారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది బీసీ కులగణన కాదు.. సమగ్ర కులగణన అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. కులగణన సర్వేను కాంగ్రెస్‌ అత్యంత ప్రాధాన్యం ఉన్న విషయంగా తీసుకుందన్నారు.  కులగణన ఎక్స్‌ రే మాత్రమే కాదు  మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిదన్నారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ అన్ని పరిస్థితులు  చూశారు…  కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ల్రో  కులగణన చేయాలని నిర్ణయించారు. కులగణన నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని అన్నారు.  నవంబర్‌ 2న జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల ఆధ్వర్యంలో  సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తామని తెలిపారు. డిసెంబర్‌ 7 నాటికి కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తవుతుందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆలోపు సమగ్ర కులగణన సర్వేను హైకోర్టుకు అందిస్తామన్నారు.  రాహుల్‌ ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామన్నారు.  రాహుల్‌ ప్రధాని కావడానికి తెలంగాణ మోడల్‌ ఉపయోగపడుతుందన్నారు.  నవంబర్‌ 31 లోగా కులగణన పూర్తి చేస్తామన్నారు. కులగణనపై  నవంబర్‌ 5 లేదా 6 న రాష్ట్రస్థాయి సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ కులగణను చేర్చాలని కోరుతామన్నారు. ప్రభుత్వ ఆదాయన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచుతామని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన పక్రియ ఈనెల 6 వ తేదిన ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విూడియా సమావేశంలో మాట్లాడారు. సమగ్ర సర్వే సక్రమంగా జరిగి భవిష్యత్‌లో అందరికి సమ న్యాయం జరిగేలా అందరు సహకరించాలన్నారు. దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు కూడా గ్రావిూణ ప్రాంతాలలో అధికారులకు సహకరించాలని సూచించారు. 50 ఇళ్లకు అధికారుల బృందం సమగ్ర సమాచార సేకరణ చేపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణలో కులగణన పక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భారాస నేతలు ప్రభుత్వాన్ని విమర్శించ డమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలకు చెందిన వారిపై భారాసకు ప్రేమలేదన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కాంగ్రెస్‌ పార్టీ నియమిం చిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ.. అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించని కార్యక్రమాలనూ చేపడుతున్నామన్న విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తించాలని హితవు పలికారు.