‘కొండగట్టు’ పవిత్రత కాపాడాలి

కరీంనగర్‌, మే 26 : ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పవిత్రను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరింది. ఈ మేరకు వారు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కొండగట్టు అతిథి గృహంలో ఆలయ సిబ్బంది ఒకరు రాసలీలలు నెరపి ఆలయ పవిత్రతకు భంగం కలిగించాడని, ఇందుకు బాధ్యుడైన ఉద్యోగిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో డిమాండ్‌ చేశారు. కొండగట్టుల భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని వసతులు కల్పించాలని, కొబ్బరి కాయలు అధిక ధరలకు అమ్మకుండా చూడాలని, దొంగతనాలు, అక్రమాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా అవి 24 గంటలూ పనిచేసేలా చూడాలని, ఆలయ భూములు పరిరక్షణ, దేవాలయ ఆవరణలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాలని, ఆలయానికి పూర్తిస్థాయి ఈవోను నియమించాలని, లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీలో నాణ్యత పెంచాలని,శాశ్వత వైద్య సిబ్బందిని నియమించాలని, కల్యాణకట్టను ఆధునీకీకరించాలనిస సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, స్నానపు గుండంలో నీటిని ఎప్పటికప్పుడు మార్చాలని, కొండపైకి వెళ్లే రోడ్డును ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కన్నమల్ల రాకేశ్‌, గౌరవ అధ్యక్షుడు జీఎస్‌ ఆనంద్‌, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతారెడ్డి, కుల సంఘాల జేఏసీ నగర కన్వీనర్‌ లింగంపెల్లి సత్యనారాయణ, అధికార ప్రతినిధి పి.నారాయణగౌడ్‌ ఉన్నారు.