‘గంగుల’ అనుచరుల భూ భాగోతం
` భూమిని కాజేసే కుట్రతో నకిలీ రిజిస్ట్రేషన్
` 21 మందిపై కేసు.. పరారీలో మిగతా 15 మంది
` నిందితులంతా బీఆర్‌ఎస్ నాయకులే..!
కరీంనగర్ బ్యూరో, ఆగస్ట్ 30 (జనంసాక్షి):భూ యజమానిని ఇబ్బందులకు గురిచేస్తూ సదరు భూమిని కాజేయాలని యత్నించిన మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరులు 21 మందిపై కేసు నమోదైంది. కొత్త జైపాల్‌రెడ్డి సహా కేసులో ఉన్న నిందితులంతా బీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారు. అందులో శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు.. మిగతావారిని పట్టుకునే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న 15 మందిపై విచారణ చేపడుతున్నట్టు కరీంనగర్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ పి విజయ్ కుమార్ తెలిపారు. బాధితుడి వివరాల మేరకు.. కరీంనగర్ కమాన్ రోడ్డుకు చెందిన నీరుమల్ల శ్యామ్ సుందర్ (58) మానకొండూర్ పరిధిలో గల సర్వే నంబర్ 1262 మరియు 1266 లలో రెండు ఎకరాల ఇరువయిన్నర గుంటల భూమిని అసలు పట్టాదారులైన దేశబోయిన బాలయ్య కుమారులైన దేశబోయిన జగత్ ప్రకాష్, దేశబోయిన శ్రీనివాస్, దేశబోయిన గోపాల్, దేశబోయిన శ్రీకాంత్‌లనుండి కొనుగోలు చేసాడు. రెవిన్యూ రికార్డుల ప్రకారం, ధరణి పోర్టల్‌లో వారి నలుగురికి గల ఆయా సర్వే నెంబర్‌లలో నాలుగు ఎకరాల భూమికి బదులుగా 7.14 ఎకరాల భూమిగా తప్పుగా నమోదైంది. ఇదే అదనుగా భావించి భూమిని పలువురికి విక్రయించారు. అందులో భాగంగానే దేశబోయిన శ్రీకాంత్, దేశబోయిన గోపాల్ లు సర్వే నెంబర్ 1266 లో అప్పటికే బాధితుడైన నీరుమళ్ల శ్యామ్ సుందర్‌కు విక్రయించిన భూమిలోనే తప్పుడు హద్దులు చూపుతూ 09 గుంటల భూమిని కొండా మురళికి రిజిస్ట్రేషన్ చేసారు. ఇది అన్యాయమని కొండా మురళి, యంసాని రాధాకిషన్‌లను బాధితుడు నిలదీయగా సమస్య పరిష్కారానికి 25 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలతో తప్పుడు రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారు. రాజీలో భాగంగా కేసు ఉపసంహరించుకున్నప్పటికీ.. ఎప్పటిలాగే వేధించడం, చివరకు కొత్త జైపాల్‌రెడ్డికి భూమిని బదలాయించడం వంటి ప్రక్రియ అక్రమంగానే కొనసాగింది. ఈ నేపథ్యంలో బాధితుడు నీరుమళ్ల శ్యామ్ సుందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు 1) చిట్టిమల్ల శ్రీనివాస్ 2) చిట్టిమల్ల అచ్చుత్ చైతన్య 3) గంప రమేష్ 4) కొండా మురళి 5) వంగల సంతోష్ కుమార్ 6) గంప నాగరాజు 7) గంప లవకుమార్ 8) గంప రవళి 9) వంగల గీత 10) గంప ఫణింద్ర 11) యం సాని రాధా కృష్ణ 12) ఆకుల సుదర్శన 13) దేశబోయిన జగత్ ప్రకాష్ 14) దేశబోయిన శ్రీనివాస్, 15)దేశబోయిన. గోపాల్ 16) దేశబోయిన శ్రీకాంత్ 17) రేగొండ సందీప్ 18) మాకు వెంకట శారదా దేవి 19) బొల్లినేని సృజనరావు 20) కొత్త జయపాల్ రెడ్డి 21) దువ్వంతుల లక్ష్మారెడ్డిలపై ఐపీసీ 420,467,468,471,386,120-బి , 506 రెడ్ విత్ 34, బి.ఎన్. ఎస్. 318(4),338, 336(3), 340(2), 308 (5), 61(2), 351(3) రెడ్ విత్ 3 (5) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసారు. చిట్టమల్ల శ్రీనివాస్, చిట్టమల్ల అచ్యుత్ చైతన్య, గంప నాగరాజు, దేశబోయిన శ్రీకాంత్, దేశబోయిన గోపాల్, దేశబోయిన శ్రీనివాస్‌లను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, గౌరవ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను జైలుకు తరలించారు.