గుడిసెవాసులపై దాడి..

నిజామాబాద్‌, జూలై 10 : నగరంలోని 36వ డివిజన్‌ వెంగళ్‌రావునగర్‌ కాలనీలో 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గుడిసెల్లో నివాసముంటున్న వారిపై సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. దీంతో గుడిసెల్లో నివాసముంటున్న కొంత మందికి గాయాల పాలయ్యారు. స్థానిక ఐదవ టౌన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కాలనీల్లో ఐదు వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని కాలనీ వాసులు తెలిపారు.కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు వచ్చి కాలనీని ఖాళీ చేయాలని బెదిరించారని కాలనీ వాసులు తెలిపారు. వీరికి సిపిఎం మద్దతు తెలిపింది. సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.

కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం ధర్నా
సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని 100 మందికి పైగా వ్యక్తులు ఒకేసారి గుడిసెలపై దాడి చేశారని సిపిఎం నగర కార్యదర్శి దండి వెంకట్‌ తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది భూకబ్జాదారులు ఈ భూమిపై కన్నేసి ఇక్కడ నివసిస్తున్న వారిని గత కొంత కాలంగా ఖాళీ చేయాలని బెదిరింపులకు గురి చేసినట్లు ఆయన తెలిపారు. అర్హులైన పేదలకు పక్కా ఇళ్ళు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీస్‌ యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పోలీసులు ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేయాలని ఆయన కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సిపిఎం నాయకులు సబ్బనిలత, నూర్జహాన్‌, శంశు, మధు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.