-->

గురుకులాల్లో కనీసవసతులు కల్పించాలి

కాకినాడ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : రాష్ట్రంలో దళితుల పట్ల జగన్‌ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు. ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం మాట దేవుడెరుగు కనీసం రక్షిత మంచి నీరు అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. సంబంధితశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇదే నియోజకవర్గానికి చెందినప్పటికీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపడంలేదని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోటి నిధులతో గురుకుల పాఠ శాలకు పలు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గురుకుల పాఠశాలలో తిష్టవేసిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండు చేశారు.