ఘనంగా జయశంకర్‌ సార్‌ వర్ధంతి వేడుకలు

నివాళులర్పించిన మంత్రులు
జయశంకర్‌ సార్‌ కలలు కన్నట్లు తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం
మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  తెలంగాణ భవన్‌లోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్‌, మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం జరిగిందని తెలిపారు. జయశంకర్‌ సార్‌ కలలు కన్నట్టు తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు
పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. మన నిధులను మన కోసమే ఖర్చు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు. తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం పోరాడిన జయశంకర్‌ సార్‌ మన మధ్య లేకపోవడం బాధాకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అనంతరం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
జయశంకర్‌సార్‌కు ఎంపీ కవిత ఘన నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ఘన నివాళులర్పించారు. జయశంకర్‌ సార్‌ సేవలను కవిత గుర్తు చేసుకున్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని జయశంకర్‌ సార్‌ అని ఆమె కొనియాడారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్‌ సార్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
నల్గొండలో ఘనంగా జయశంకర్‌ సార్‌ వర్థంతి..
తెలంగాణా రాష్ట్ర ఉద్యమ సిద్ధాంత కర్త దివంగత ఆచార్య జయశంకర్‌ 7 వ వర్థంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణా జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్‌ మరియు యస్‌.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి పాల్గొని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్టాన్ని దివంగత ఆచార్య జయశంకర్‌ సార్‌ యాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. జయశంకర్‌ సార్‌ కోరుకున్న బంగారు తెలంగాణా నిర్మాణం కోసం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ముందుకు సాగుతున్నామన్నారు.
ప్రతి ప్రణాళిక లో ఆచార్య జయశంకర్‌ సార్‌ ఆశయ సాధననే ద్యేయంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆయన చెప్పారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చేయిర్మెన్‌ బండా నరేందర్‌ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ కంచర్ల భూపాల్‌ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చేయిర్మెన్‌ రేకల భద్రాద్రి,స్థానిక మార్కెట్‌ కమిటీ చేయిర్మెన్‌ కరీం పాషా ,మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్‌, కార్యక్రమ నిర్మావహాకులు తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షులు బోనగిరి దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.