ఘనంగా శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌: శ్రావణ మాస మహోత్సవాలు హైదరాబాద్‌ కొత్తపేటలోని అష్టలక్ష్మీ దేవాలయంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 వారాలపాటు నిర్వహించే  శ్రావణ శుక్రవార ఉత్సవాల్లో తొలిరోజున మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునుంచే మహిళలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆదిలక్ష్మిసమేత శ్రీమన్నారాయణ స్వామికి అభిషేకం నిర్వహించి  భక్తుల సమక్షంలో సహస్ర కుంకుమార్చన చేశారు. లక్ష్మిదేవికి ప్రత్యేకంగా తయారుచేసిన బంగారు వస్త్రాన్ని వేసి అలంకరించారు. ఈ శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.