చట్టసభను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ మన్మోహన్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ సమావేశాలు స్తంభింపజేసిన ప్రతిపక్ష బీజేపీపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో బీజేపీ అనుసరించిన తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాల్సి ఉండగా.. సభను అడ్డుకోవడాన్ని ఆక్షేపించారు. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం ప్రధాని పార్లమెంట్‌ ఆవరణలో విూడియాతో మాట్లాడారు. భారత్‌ అనేక సమస్యలతో సతమతమవుతోందని.. ఆయా సమస్య లపై తక్షణ చర్చ అవసరమని అన్నారు. ‘భారత్‌ అనేక సమస్యలను ఎదుర్కొం టోంది. హింస, ఉగ్రవాదం, నక్సలిజం… ఆయా అంవాలపై పార్లమెంట్‌లో చర్చించాల్సింది’ అని అభిప్రాయపడ్డారు. సమావేశాలు సజావుగా సాగేందుకు బీజేపీ సహకరించాల్సి ఉండాల్సిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాగేనా వ్యవహరించేది? అన్నది వారే నిర్ణయించుకోవాలని సూచించారు. సభను అడ్డుకోవడం, రాజ్యాంగం, పార్లమెంట్‌ నిబంధనలను ఉల్లంఘించడం ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించడమే అని విమర్శించారు. ఇది పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థను అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. చీటికిమాటికి సభా కార్యకలా పాలకు అడ్డుకున్న ప్రతిపక్షాల తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రధాని కోరారు. కాగ్‌ను ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని మన్మోహన్‌ స్పష్టం చేశారు. ‘మేం కాగ్‌ను గౌరవిస్తున్నాం. కాగ్‌ నివేదికలోని వాస్తవాలను బయటకు తెచ్చేం దుకే చర్చకు అనుమతించేందుకఅంగీకరించాం’ అని చెప్పారు. కాగ్‌ నివేదికపై పార్లమెంట్‌లోనూ, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీలోనూ చర్చించే అవకాశమున్నా.. ప్రతిపక్షం కావాలనే అడ్డుకుందని ఆరోపించారు. వారి వల్ల పార్లమెంట్‌ సమావేశాలు వృథా అయ్యాయని, ఉభయ సభల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. కాగ్‌ నివేదిక సరైనదా? కాదా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.